సిటీబ్యూరో, జూన్ 24(నమస్తేతెలంగాణ): ‘జవహర్‌నగర్’తో లక్షలాది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా..? చెత్త డంపింగ్ ఆపకపోతే.. కాలుష్య కాసారాలు మరింత విస్తరించి.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయా..? అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. భవిష్యత్‌లో నివాస యోగ్యం..ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చెరువులు, భూగర్భ జలాలు, భూములు విషతుల్యమయ్యాయి. ఈ పరిస్థితి కాలుష్య తీవ్రతకు అద్దంపడుతున్నదని చెబుతున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు కొత్తగా చెత్తను తరలించొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బల్దియాను ఇప్పటికే ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన బల్దియా, నిర్వహణ బాధ్యతల్లో ఉన్న రాంకీ సంస్థకు భారీగా జరిమానాలూ విధించింది. ఉన్న వ్యర్థాలను రీసైక్లింగ్, సెగ్రిగేషన్ చేయాలని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశాలూ ఇచ్చింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సైతం డంపింగ్ యార్డు కారణంగా పరిసరాల్లో ఏర్పడుతున్న కాలుష్యం అదుపునకు పలు సూచనలిచ్చింది. ఇలా పీసీబీ, ఎన్జీటీ, పర్యావరణవేత్తల సలహాలు, సూచనలు ఇచ్చినా.. బల్దియా బేఖాతరు చేస్తున్నది. చెత్త తరలింపు కొనసాగుతూనే ఉంది. గుట్టలుగుట్టలుగా వ్యర్థాలు పేరుస్తూనే ఉన్నది. ఫలితంగా దుర్వాసన..రోగాల కారణంగా ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నది.
చురకలంటించినా ఆగని చెత్త తరలింపు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలింపును తక్షణమే నిలిపేయాలని జీహెచ్ఎంసీకి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఉన్న చెత్తను ప్రాసెస్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా రీక్లెయిమ్ చేసిన 214 ఎకరాల ప్రాంతంలోనే ప్రాసెసింగ్ జరగాలని, కొత్త వ్యర్థాలు చేర్చకూదని స్పష్టం చేసింది. చెత్తను ప్రాసెస్ చేయడం, కాలుష్యాన్ని అరికట్టడం, పరసర గ్రామాల ప్రజల ఇబ్బందులు కలిగించినందుకు గత నవంబర్‌లో జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్వీరో సంస్థకు భారీగా జరిమానాలు కూడా విధించింది. లిచెట్ ప్రాసెసింగ్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇందుకోసం కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని సూచించింది. లిచెట్ ఓవర్ ఫ్లోను నివారించేందుకు వర్షపు నీటిని డంపింగ్ యార్డులోకి వెళ్లకుండా మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి భారీగా విడుదలవుతున్న లిచెట్లో హానికరమైన కారకాలున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. దీంతో ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు పరిశోధించి హానికర కారకాలను గుర్తించాలని సూచించింది. ఎన్జీటీ జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా చెత్త తరలింపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడంలో కూడా జీహెచ్ఎంసీ తాత్సారం చేయడంతో పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసన, కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోతున్నారు.

పీసీబీ సూచనలు బుట్టదాఖలు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు తగిన సూచనలు చేసింది. ముఖ్యంగా చెత్త నుంచి విడుదలయ్యే లిచెట్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది విపరీతంగా విడుదలవుతుండటంతో భూగర్భ జలాలతో పాటు, డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లోని భూములు కలుషితమవుతున్నాయి. లిచెట్ ప్రాసెసింగ్ పకడ్బందీగా చేయాలని జీహెచ్ఎంసీ, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వాహకులకు అనేకసార్లు సూచనలు చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సూచించారు.
కొన్ని సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ బేస్డ్ స్ప్రేలు నిర్వహించాలన్నారు. లిచెట్ ప్రాసెసింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని, దాని ద్వారా ఏర్పడే కాలుష్యాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని 2017 నుంచి 6 సార్లు మార్గదర్శకాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా.. చెత్త నిర్వహణ, ప్రాసెసింగ్ విధానంలో ఎలాంటి మార్పులు కనపించడం లేదు. పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. ఇలాగే కొనసాగితే చెత్త గుట్టలు విస్తరించనున్నాయి. కాలుష్యం మరింత ప్రాంతానికి విస్తరించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.
డంపింగ్ యార్డు వికేంద్రీకరణే శరణ్యం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డును వికేంద్రీకరణ చేయడమే కాలుష్య నియంత్రణకు శరణ్యం. పెరుగుతున్న నగరీకరణ, జనాభాకు అనుగుణంగా రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యర్థాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చెత్తనంతా జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులోనే పడేయడంతో కాలుష్యం మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకే నగరానికి సుదూర ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలి. అక్కడ పోగైన చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసి పేరుకుపోకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ ప్రాంతంలోనూ కాలుష్యం పెరగకుండా పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే.. హైదరాబాద్ శివారు ప్రజలు, పర్యావరణం పరిరక్షణ సాధ్యమవుతుంది.
– డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త
