చిక్కడపల్లి, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడతామని ఉద్యమకారుల జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే అంశంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ కమ్యూనిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదమల్ల వెంకట్ స్వామి, తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ అధ్యక్షుడు ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి మోసకారి కాంగ్రెస్కు బుద్ధిచెబుతామని స్పష్టం చేశారు. బహుజన ముక్తి పార్టీ అధ్యక్షుడు అంసోల్ లక్ష్మణ్, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, మోహన్ బైరాగి, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రజ్యోత్ కుమార్, సుజి, లావణ్య జానికి రెడ్డి, సుచరిత, 1969 ఉద్యమకారుడు బోయపల్లి రంగరెడ్డి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.