హిమాయత్ నగర్, జూన్ 17: రాష్ట్రంలో ఉపాధి దెబ్బతిని తమ కుటుంబాలను పోషించుకోలేక ఎంతో మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆర్థికంగా ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతుందని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు ఆరోపిం చారు. మంగళవారం హైదర్ గూడలోని ఎన్ ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ ఆటోలు నడవక గిరాకీలు దెబ్బతిని ఆటోడ్రైవర్లు త్రీవ ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో మరిన్ని ఆటోలకు పర్మిట్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే ఆటో పర్మిట్ జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త ఆటో పర్మిట్ల పేరిట కొన్ని ఆటోడ్రైవర్ల సంఘం నేతలు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కొత్త ఆటోలకు పర్మిట్లను తీసుకువచ్చి ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఆటోలు నడవడం లేదంటే కొత్త ఆటోలు ఎందుకు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటోడ్రైవర్లను ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునేలా చేసిందని ఆరోపించారు.
ఎల్పీజీ, సీఎన్జీ ఎలక్ట్రిక్ ఆటోలు పాత పర్మిట్ల స్థానంలోనే ఇవ్వాలని అన్నారు. ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎలక్ట్రికల్ ఆటోలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి జాతీయ బ్యాంకులతో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లు, డీలర్ల బెదిరింపులు, దోపిడీలు అరికట్టాలని,ఏటా రూ.12 వేల హామీని ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అమలు చేసి ఆటోడ్రైవర్లకు వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జేఎసీ నేతలు రవికుమార్, కొమురయ్య, పెంటయ్య గౌడ్, నంద కిషోర్, శ్రీనివాస్, రవి, శ్రీధర్ రెడ్డి, ఈశ్వర్, సాయిలు, సమ్మయ్య, వజ్ర లింగం తదితరులు పాల్గొన్నారు.