Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని.. నైతిక విజయం తనది, బీఆర్ఎస్దే అని ఆమె స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. పోలింగ్ రోజున ఎంతో అరాచకం సృష్టించారని తెలిపారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. నేను ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇవాళ ఉదయం నుంచే కౌంటింగ్ హాలులో ఆడవాళ్లపై కాంగ్రెస్ ర్యాగింగ్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఒక మహిళపై కాంగ్రెస్ నేతలు రౌడీ రాజకీయం చేశారని అన్నారు. ప్రజలను కాంగ్రెస్ భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.