సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు. చెత్త తరలింపునకు 268 మినీ టిప్పర్లు వినియోగిస్తుండగా..అందులో 150 పాతవి..వీటి నిర్వహణ డీజిల్, మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.అయితే చాలా వరకు 15 ఏండ్లు దాటిన టిప్పర్లు ఉన్నాయి.వీటిని స్కాప్క్రు పంపించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
కానీ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా సంస్థ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. ఈ టిప్పర్ల వినియోగంలో డీజిల్ దోపిడీ ఒక్కటే కాదు..చాలా వరకు మరమ్మతుల పేరిట కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాత టైర్లు వేసి కొత్త టైర్లు వేసినట్లు బిల్లులు పెట్టడం…రిపేర్లలో వినియోగించే సామాన్లు సైతం అధిక మొత్తంలో బిల్లులు పెట్టి ఖజానాను గండి కొట్టడం లాంటి ఘటనలు లేకపోలేదు.
కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషన్ల వరకు ఇన్నోవా వాహనాలను వినియోగిస్తుండగా…డిప్యూటీ కమిషనర్లు, కొందరు ఇంజనీర్లకు బొలొరో వాహనాన్ని వాడుతున్నారు..ఐతే బొలొరో వాహనాలు చాలా వరకు 15 ఏండ్లకు పైబడినే ఉన్నాయి. వీటి నిర్వహణలోనూ ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో దాదాపు 38 స్వీపింగ్ మిషన్లు ఉండగా..వీటిలో 17 వాహనాలు బల్దియాకు చెందినవి కాలపరిమితి ముగియడంతో పక్కన పడేశారు. ప్రస్తుతం సుమారు 18 వెహికల్స్ అద్దె ప్రాదిపదికన కొనసాగుతున్నాయి. అద్దె ప్రాతిపదికన ఏజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి రూ. కోటి 13 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా వీటి కోసం రూ.20కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ స్వీపింగ్ యంత్రాలతో ఒక్కో మిషిన్ 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు క్లీన్ చేయాలి.
కానీ కొన్ని ఏజెన్సీలు సగం కిలోమీటర్లు కూడా చేయకుండా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు నగరంలోని వీఐపీలు ఉండే ప్రాంతాల్లోనే తప్ప కమర్షియల్ కారిడార్లు, ప్రధాన రహదారులపై మాత్రం కనిపించడం లేదని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి రెండు స్వీపింగ్ మెషిన్లు హెచ్జీసీఎల్ (హెచ్ఎండీఏ ఔటర్ విభాగం)కు అప్పగించగా..తిరిగి హెచ్జీసీఎల్ నుంచి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు వచ్చిన వాటిని పూర్తిగా పక్కకు పెట్టడం అధికారుల పనితీరుకు గమనార్హం.