సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న వేళ విద్యార్థులు, సాధారణ వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రతి రోజూ అనేక మంది విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకొని పరీక్షలకు వెళ్లే సమయంలో ఆందోళనకు గురవుతున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూకట్పల్లి, బోయిన్పల్లి, సికింద్రాబాద్, ఎస్ఆర్నగర్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, హబ్సిగూడ, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఇలాంటి సమస్యను విద్యార్థులు ప్రతి రోజూ ఎదుర్కొంటున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో వాటిని కొందరు అధికారులు అమలు చేయకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలొస్తున్నాయి.