సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్‌తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులకు అందుబాటులోకి రావడం లేదన్న చర్చ అటు జీహెచ్ఎంసీ అధికార వర్గాలు, ఇటు పాలక మండల సభ్యుల్లో చర్చ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ. 629.30 కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేసుకోగా, ప్రారంభం విషయంలో తరచూ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తుండడమే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు.
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవ సంబరాల్లో పురపాలకకు సంబంధించిన ఈ నెల 3న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరపాలని నిర్ణయించి కొన్నింటిని ప్రారంభించారు. అయితే షెడ్యూల్ ప్రకారం వర్చువల్ విధానంలో జూపార్కు-అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభం ఉందని, ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కానీ ఆ రోజు కుదరలేదని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత 5వ తేదీ, 8వ తేదీ అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 9న ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ నాలుగు దఫాలుగా వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు ఇప్పటి వరకు ఈ ఫ్లై ఓవర్ ఎప్పుడు ప్రారంభిస్తారో వెల్లడించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. సీఎంవో ఆదేశాలు వస్తేనే ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఉంటుందని సంబంధిత ఇంజినీర్లు చెబుతుండడం గమనార్హం.
ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య గ్యాప్ కారణం?
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా తీరు ఇందుకు ఆజ్యం పోసినట్లు పాలకమండలి సభ్యుల్లో చర్చ జరుగుతున్నది. ఉద్ధౌలా చెరువు సమీపంలో ఎంఐఎం పార్టీ నేతలకు సంబంధించిన భవనాలను కూల్చివేయడం, సల్కం చెరువులోని నిర్మాణాలు, ఎంపీ అసదుద్దీన్‌కు సంబంధించిన విద్యా సంస్థలపై హైడ్రా వ్యవహరించిన తీరుపై అసదుద్దీన్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య దూరం పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. హైడ్రా ఏర్పాటుపై జీహెచ్ఎంసీ పాలకమండలిలో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు మేయర్‌ను కలిసి వ్యతిరేకిస్తూ పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.
దీనికి తోడు ఇటీవల చాదర్ఘట్ సమీపంలోని చికెన్ మార్కెట్ వ్యవహారంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వర్సెస్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ బేగ్ మధ్య తారాస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస సంఘటనల నేపథ్యంలోనే ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న చర్చ జరుగుతున్నది. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ అసదుద్దీన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే జీహెచ్ఎంసీ అధికారుల ఆహ్వానానికి అట్నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. మొత్తంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య గ్యాప్ పెరగడం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీ కోసం ప్రారంభోత్సవాన్ని ఇంకా ఎన్ని సార్లు వాయిదా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
పాతనగరానికి ఉపశమనం
ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ) కార్యక్రమం ద్వారా విడతల వారీగా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లు, లూప్‌లను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం జూపార్కు-అరాంఘర్ ఫ్లై ఓవర్ విషయంలో తాత్సారం చేస్తూ వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పాతనగరంలో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా..ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడనున్నది. వీలైనంత త్వరగా ఈ ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.