దుండిగల్, ఫిబ్రవరి 12: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు బోరబండలో నివాసముంటున్నారు. వీరి రెండో కుమార్తె పూజిత(18) బాచుపల్లి లోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ, గర్ల్స్ క్యాంపస్ (ఎస్ఆర్ గాయత్రి) కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
బుధవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి రాకపోవడంతో హాస్టల్ ఇన్చార్జి..పూజిత ఉంటున్న గదిలోకి వెళ్లి చూడగా, ఉరివేసుకొని కనిపించింది. వెంటనే సిబ్బంది స్థానిక మమత వైద్యశాలకు తరలించారు. అప్పటికే పూజిత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు.అయితే ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం తమ కూతురు చనిపోయిన విషయాన్ని దాచి తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, తమకు తెలియకుండానే మృతదేహాన్ని గాంధీకి తరలించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.
కళాశాల ప్రిన్సిపాల్ నిరూపరెడ్డిని పిలవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమెను కళాశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పూజిత ఆత్మహత్యాయత్నం చేయగా, వైద్యశాలకు తరలించినట్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని ఆమెపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో క్లూస్ టీం పోలీసులు హాస్టల్ గదిలోకి వెళ్లి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప.. పూజిత మృతిపై నిర్దిష్టంగా తామేం చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.