మేడ్చల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సర్వే పూర్తయిన చెరువులను త్వరలోనే పరిశీలించేందుకు హైడ్రా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలల్లో మొత్తం 620 చెరువులు ఉండగా వీటిలో 97 చెరువులకు సంబంధించి సర్వే పూర్తి చేసి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులను గుర్తించారు. గుర్తించిన చెరువుల వివరాలను ఇటీవలే హైడ్రా అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. దీంతో మొదటి విడతలో జిల్లాలో 97 చెరువులను పరిశీలించేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది.
ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దుల లోపు ఉండే నిర్మాణాలు, లే అవుట్ల లెక్క తేల్చేందుకే హైడ్రా అధికారులు చెరువులను పరిశీలించనున్నట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటికే చెరువుల సమీపంలో ఉన్న నిర్మాణాలు, లే అవుట్ల వివరాలను రెవెన్యూ అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదికలను సమర్పించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. హైడ్రా అధికారులు చెరువుల పరిశీలన చేయనున్నట్లు తెలుసుకున్న చెరువుల సమీపంలో నిర్మించుకున్న నిర్మాణాల యజమానులు ఆందోళనకు గురువుతున్నారు.
మరో 110 చెరువులు..
జిల్లాలోని మరో 110 చెరువుల సర్వే పూర్తి చేసి హద్దులను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించారు. ప్రభుత్వం 110 చెరువుల హద్దుల నిర్ణయంపై నోటీఫై చేసిన అనంతరం హైడ్రా అధికారులకు ఆందించనున్నారు. తదుపరి హైడ్రా అధికారులు రెండో విడతలో హద్దులు గుర్తించిన చెరువులను పరిశీలించేందుకు సిద్ధం కానున్నారు. మిగతా 413 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు డీజీపీఎస్ యంత్రాల సాయంతో సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, జిల్లాలోని అనేక చెరువుల సమీపంలో వందలాది సంఖ్యలో లే అవుట్లు ఉన్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.