సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతటికీ కావాలంటే కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ముక్తకంఠంతో ఆకాంక్షించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతిరూపంగా.. గంగాజమునా తెహజీబ్ మోడల్ అవసరమని దేశ ప్రజలు గుర్తించారంటూ.. ఉజ్వల భారత్ కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ‘నమస్తేతెలంగాణ’తో వారు మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.
‘సోషల్ మీడియాలో ఐటీ నిపుణులు, ఉద్యోగుల పాత్ర’పై మూసాపేటలో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ తీర్మానం చేసి అభివాదం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు తదితరులు
రాష్ట్ర ప్రగతిని చూసి..
దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యవసాయ, రక్షణ, ఉపాధి రంగ అంశాలపై నిర్ధ్దిష్టమైన అవగాహన కలిగిన ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి.. ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు కూడా ఇలాంటి అభివృద్ధినే కోరుకుంటున్నారు. దేశ ప్రజలు రాజకీయాల్లో మార్పు అవసరమంటున్నారు. ఆ బాధ్యతను కేసీఆర్‌పై పెట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నాయకుడు కేసీఆర్ అని విశ్వసిస్తున్నారు.
– డాక్టర్ బేగ్, డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు
గొప్ప నాయకుడు
అన్నదాతల సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేసి.. రైతే రాజు అనే సామెతను సార్థకం చేశారు. రాజకీయాల్లో ఎంతో సామర్థ్యం కలిగిన సీఎం కేసీఆర్ వంటి నాయకులు దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ట్రాల రైతులు కోరుకుంటున్నారు. బంగారు తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌తోనే బంగారు భారత్ సాధ్యమవుతుంది.
– సల్వది శ్రీరాం, టీఎన్జీవో హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు
ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట
గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా సర్కారు ఉద్యోగులకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఆదరిస్తుంటే..కేంద్రం మాత్రం పన్ను రూపేణా దోచుకుంటున్నది. సీఎం కేసీఆర్ వంటి గొప్ప నాయకులు దేశ రాజకీయాల్లోకి వెళితే.. దేశంలోని ఉద్యోగులతో పాటు సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
– ఎంబీ కృష్ణాయాదవ్, టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు
ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం
తెలంగాణ తరహాలో దేశంలోని అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందాలంటే దేశ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి. దేశంలోని చాలా రాష్ర్టాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. కొత్తగా ఉద్యోగాలు కల్పించక పోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడే స్థితికి దిగజార్చింది. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం లేదు. గ్యాస్, ఆయిల్ ధరలు పెంచి పేదోడు బతికే పరిస్థితులు లేకుండా పోయాయి. రాష్ర్టాభివృద్ధితో పాటు అన్ని వర్గాలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు.
– ఎర్రవెల్లి శేషసాయి గిరికాంత్, ప్రభుత్వ ఉద్యోగి
దేశం పిలుస్తోంది..
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశం అభివృద్ధి చెందుతుంది. సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ వంటి నాయకులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
– డాక్టర్ ముత్యాల సత్యనారాయణగౌడ్, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు,
బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
ధరల నియంత్రణలో విఫలం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రూపాంతరం చెందితే కేంద్రంలోని అధికార పార్టీకి ఇబ్బంది తప్పదు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టిసారించలేకపోతున్నది. తద్వారా ఇబ్బందులు తప్పడం లేదు. ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో దేశంలోని ఇతర పార్టీలను ఏకం చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం అభినందనీయం.
– శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి
స్వాగతిస్తున్నాం
తెలంగాణ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రం విభజన అయితే కరెంటు ఉండదని చెప్పిన వారి నోళ్లు మూయించి రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. అంతటి గొప్ప నేత కావాలని దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని రైతులు కోరుకుంటున్నారు. స్వరాష్ట్రంలో ఉచిత కరెంటు ఇచ్చి రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి వెళ్తే.. యావత్ భారతావనికి న్యాయం జరుగుతుంది.
– డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు
ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు..
దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్న మోదీని గద్దె దింపాల్సిందే. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఉండే వాళ్లని పుస్తకాల్లో చదివే రోజు భవిష్యత్‌లో వస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తూ మంచి పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్లాల్సిన అవసరం ఉంది.
– ఎ.నర్సింగ్‌రావు, ప్రభుత్వ ఉద్యోగి, మధుబన్‌కాలనీ
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
దేశంలో మత విద్వేషం పెరుగుతున్నది. మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతున్నది. ఇలాంటి తరుణంలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. ఆ ఫలాలను ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందించారు. 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఈ పథకాలు దేశంలోని ఏ రాష్ర్టాల్లో లేవు. దేశం మొత్తం అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమవుతుంది.
– జి.చంద్రశేఖర్ (చందు), టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి
ఐటీ ఎగుమతుల్లో 26 శాతం వృద్ధి
2021-22లో దేశ ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు 17 శాతం ఉంటే.. తెలంగాణ రాష్ట్రం 26 శాతం వృద్ధిరేటును సాధించడం గొప్ప విషయం. రాష్ట్రం ఏర్పడినపు్పుడు రూ.57 వేల కోట్ల ఐటీ పెట్టుబడులు రాగా, ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం రూ.1.83 లక్షల కోట్లకు పెట్టుబడులు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హైదరాబాద్ నగరంలో భౌగోళిక సామాజిక వాతావరణ అనుకూలత వల్ల పెట్టుబడులు 200 శాతం పెరిగాయి. నగరంలో ఐటీఐఆర్ రద్దుతో సుమారు 2 లక్షల కోట్ల నష్టంతో పాటు వేలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. దేశంలో భాగమైన రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరం.
– కట్ట రవి కుమార్, తెలంగాణ ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్ గొప్ప నగరం
ప్రపంచంలోనే ఎక్కడా లేని అనుకూలతలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయి. గతంలో ఐటీ పరిశ్రమలు, ఉద్యోగాలు అంటే బెంగళూరు, పుణె వైపు చూడాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప ఐటీ పరిశ్రమ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచంలోని గొప్ప గొప్ప కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా రాష్ర్టానికి ఆదాయం, యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.
– కరీం పాషా, ఫార్మా కంపెనీ సాఫ్ట్వేర్ నిపుణుడు
ఐటీఐఆర్ రద్దుతో..
నైపుణ్యవంతులైన యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. పారిశ్రామిక వృద్ధి సాధిస్తేనే ఉపాధితో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. ఫార్మా, ఐటీ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాలి. హైదరాబాద్ నగరంలో ఐటీఐఆర్‌కు ఆమోదం లభిస్తే వేలాది మందికి ఉపాధి దొరికేది. కానీ.. కేంద్ర ప్రభుత్వం చిన్నచిన్న కారణాలను సాకుగా చూపుతూ రద్దు చేయడంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నది.
– సాయిలక్ష్మి, ప్రైవేట్ ఉద్యోగి
ఐటీ రంగంలో దూసుకెళ్తోంది..
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నది. భూకంపాలు, వరదలు, ఇతరత్రా సమస్యలు లేని నగరం హైదరాబాద్. ఇక్కడ ఐటీఐఆర్‌కు కేంద్రం ఆమోదిస్తే ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలంగాణతో పాటు భారతదేశం అభివృద్ధిని సాధించేది. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం, తెలంగాణ రాష్ట్రంపై వివక్ష కారణంగా ఐటీఐఆర్‌ను అడ్డుకున్నది. దీంతో వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
– భవనం నవీన్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి
గణనీయమైన ప్రగతి
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షతను వీడాలి. హైదరాబాద్ నగరంలో ఐటీఐఆర్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి సహకారం లేకున్నా హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నది. అన్నీ అనుకూలతలున్న నగరంలో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తే ప్రత్యేక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
– ఎం.లింగంగౌడ్, సాఫ్ట్వేర్ నిపుణుడు