సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) ; పంద్రాగస్టు(మంగళవారం) నుంచే నగర వ్యాప్తంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీని ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
సర్వజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం కేసీఆర్కు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 1200లకు పైగా కళాకారులు జానపద కళారూపాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వాగతించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమస్త జనులకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ తమ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నదన్నారు. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఒక లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేయబోతున్నదని ప్రకటించారు. విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 67,149 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నదని వివరించారు.
పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు.