సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి జనం నీరాజనం పలుకుతున్నారు. అడుగడుగునా డప్పు చప్పుళ్లు, బతుకమ్మ ఆటలు, పూల వర్షంతో ఆదరిస్తున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుతున్నారు. అభ్యర్థులు సైతం పదేండ్లలో జరిగిన అభివృద్ధి కండ్ల ఎదుటే ఉన్నాయని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమం జరిగేందుకు మరోసారి ఆశీర్వదించాలని కోరుతుండగా..కొన్ని చోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీ వాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చి కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఉప్పల్, సనత్నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఎక్కువగా తీర్మానాల జాతర నడుస్తోంది. కళ్లముందు సంక్షేమం, అభివృద్ధి- ఇంటి ముందు అభ్యర్థి అంటూ స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం పర్వం సాగుతుండటంతో ఎమ్మెల్యేలకు మద్దతుగా కాలనీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు బ్రహ్మరథం పడుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ కంటే నెలన్నర ముందే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇన్నాళ్లూ ప్రజల్లో ఉండి సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పుడు తాము చేసిన అభివృద్ధినే ప్రజల ముందు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి ఫలాలు ఎలా ఉన్నాయనే దానిపై వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకుపోతుండగా… అదేరీతిన ప్రజల్లోనూ విశేష స్పందన వస్తున్నది. తమ కండ్ల ముందే అభివృద్ధి కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులను ప్రకటించకపోవడం ఒకవంతైతే… ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మొదలు పెట్టకపోవడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. దాదాపు రెండు నెలల గులాబీ శ్రేణుల ప్రచార శైలితో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.