పార్కింగ్ స్థలాలను పప్పు బెల్లంలా అయినవాళ్లకు పంచి పెట్టి.. హెచ్ఎండీఏ ఖజానకు భారీ గండి పెడుతున్నారు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు. ట్యాంక్ బండ్‌పై పార్కింగ్ లీజ్ వ్యవహారం నడుస్తుండగా, గడువు ముగిసినా..పార్కింగ్ పనులకు టెండర్లు పిలవకుండా ఎన్నికల పేరిట కాలయాపన చేసిన అధికారులు… స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అయినవాళ్లకు కాంట్రాక్ట్ అప్పగించేందుకు చకచకా పావులు కదిపారు.
ఇంకేముంది పార్కింగ్ పేరిట హెచ్ఎండీఏకు రావాల్సిన నిధులకు చిల్లు పడేలా…అడ్డికి పావుసేరు చొప్పున కట్టబెట్టారు. దీని వెనుకాల స్థానిక ఎమ్మెల్యే లాబీయింగ్తోపాటు, ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడంలో బీపీపీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై సదరు విభాగం ఉన్నతాధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా, అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం దీనిపై స్పందించాల్సిన ఏవో స్థాయి అధికారి కూడా తాను చెప్పేదంతా అనధికారమేనని, అక్కడా అంత రెవెన్యూ లేదని బుకాయించడం కొసమెరుపు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ)
టెండర్ గడువు ముగిసినా..
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఎన్జీఆర్ గార్డెన్, ఘాట్, ఐమ్యాక్స్ ఎదురుగా పార్కింగ్ సేవలు నిర్వహించేందుకు గతంలో నోటిఫికేషన్ విధానంలో ఏటా సుమారు రూ. 80 లక్షల చొప్పున టెండర్ ద్వారా అప్పగించేవారు. ఇన్నాళ్లు ఇదే తరహాలో మూడేండ్ల పాటు నిర్వహించుకునేలా లీజ్ ప్రక్రియ సాగింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్ గడువు ముగియడంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. అయితే టెండర్ గడువు ముగిసిన వెంటనే అధికారులు ఆదాయం కోల్పోకుండా పాత సంస్థనే పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది.
కానీ ఆ టెండర్‌ను తమకు కావాల్సిన వాళ్లకు ఇప్పించుకునే క్రమంలో ఎన్నికల కోడ్ పేరిట రీ టెండర్ కానీ టెండర్ గడువు పొడిగించడం కానీ చేయలేదు. దాదాపు 7 నెలల తర్వాత వ్యవహారాన్ని నడిపించిన బీపీపీ ఇద్దరు అధికారులు… గుట్టుగా కొత్తగా హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైల్ కదిలించి, సంస్థ ఆదాయానికి నష్టం లేకుండా టెండర్ అప్పగిస్తున్నట్లు కవర్ చేసినట్లు తెలిసింది.
అయితే ఆ ఉన్నతాధికారికి ఈ విషయంపై సమాచారం లేకపోవడంతో నేరుగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేకుండా ఉండాలని భావించి… పాత సంస్థ వద్ద పెండింగ్ బిల్లులు వసూలు చేయకుండానే కొత్తగా 10 రోజుల కిందట మరో కంపెనీకి అప్పగించినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోగా.. కనీసం చార్జీల విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టే విభాగం చేసిన మాయాజాలమేనన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి తోడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చెప్పారనే కారణంతో ఆ పార్కింగ్ టెండర్ వ్యవహారం నడిచినట్లుగా తెలుస్తోంది. దీనిపై గతంలో పార్కింగ్ బాధ్యతలు నిర్వహించిన సంస్థ కూడా హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించినా… ప్రయోజనం లేదని, అప్పటికే కేటాయింపులు పూర్తి చేయడంలో బీపీపీలోని ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరించారని ఆ విభాగంలోనే చర్చ నడుస్తున్నది.
కావాల్సిన వాళ్లకు టెండర్
అయితే తాత్కాలిక ప్రాతిపదికనే ప్రస్తుతం లీజుదారుడికి బాధ్యతలు అప్పగించారని, అందుకు అవసరమైన మొత్తాన్ని కూడా బీపీపీ దరావతుగా తీసుకుందని చెబుతున్నా… తాత్కాలిక ప్రాతిపదికత కోసం రూ. 30-40లక్షలు ఎలా చెల్లించారనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. ఇందులోనే అసలు మతలబు ఉందని, ముందుగా కావాల్సిన వాళ్లకు టెండర్ అప్పగించి… తీరిగ్గా మరోసారి ఆన్లైన్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి… ప్రస్తుతం ఉన్న సంస్థకు అప్పగించే ఉద్దేశమే తప్ప..మరొకటి కాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వచ్చే జనవరి వరకు ఈఎండీ చెల్లించినట్లు తెలుస్తుండగా… ఇందుకు సంబంధించిన ఏ వివరాలు కూడా విభాగంలో లేకపోవడం, వివరాలన్నీ గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉచితానికి మంగళం..
ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉచిత పార్కింగ్ సదుపాయం ఉన్నది. అయితే ఇక్కడ కూడా వాహనదారుల నుంచి అందిన కాడికి వసూలు చేస్తున్నారు. గతంలో వసూలు చేసిన ధరల కంటే రెండింతలు వసూలు చేస్తుండగా, టూవీలర్‌కు రూ. 50 చొప్పున, ఫోర్ వీలర్‌కు రూ. 100 చొప్పున వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. బీపీపీ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో ఉచితంగానే పార్కింగ్ సదుపాయం కల్పించాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చేలా బీపీపీ అధికారుల చర్యలు ఉండటంతో హెచ్ఎండీఏకు భారీ నష్టం జరుగుతున్నది.
రెండింతలు వసూలు
హెచ్ఎండీఏ టెండర్ ప్రకారం గతంలో పార్కింగ్ ఫీజు వసూలు చేసిన సంస్థలకు నిర్ణీత ధరలను నిర్దేశించింది. ఇందులో టూవీలర్, త్రీ వీలర్‌కు రూ. 20, కారుకు రూ. 40, మినీ బస్సుకు రూ. 100 చొప్పున, బస్సుకు రూ. 200 చొప్పున జీఎస్టీతో కలిపి వసూలు చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇవేవి లేకుండానే… కేవలం కారుకే రూ. 100 చొప్పున వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో, బైకు, ఆటోలకు రూ. 50 చొప్పున వసూలు చేస్తుండగా… ఖైరతాబాద్ బడా గణేశుడిని చూసేందుకు బస్సులో వస్తున్న వారి నుంచి ఏకంగా రూ. 250-400 చొప్పున వసూలు చేస్తుండటం వెనుక… హెచ్ఎండీఏకు వచ్చే కోట్ల ఆదాయాన్ని కోల్పోయేలా బీపీపీ నిర్లక్ష్యం వహించింది.
ఇక అధికారులు కూడా దీనిపై ఏ మాత్రం స్పందించకుండా… ఉన్నతాధికారులకు నచ్చిన వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టే అధికారం ఉందంటూ వివరించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 12న టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే టెండర్ నుంచి తొలగిస్తారని, ఇక ధరలు కూడా పెంచే అవకాశం ఉన్నదని, అందుకే కారుకు రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారని బీపీపీ వర్గాలు చెబుతుండటం వెనుక కేవలం సదరు కొత్త సంస్థకు లబ్ధి చేకూర్చే వ్యవహారమేనని సమాచారం.