సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి రూ.3వేల కోట్ల స్కామ్ జరిగినట్లుగా తేల్చారు. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన సాహితీ యాజమాన్యంపై మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఒక్క అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు ఉన్నాయి. ఇందులో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కంపెనీ యాజమాన్యంలోని సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన డబ్బులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించారని పోలీసులు గుర్తించగా.. మొత్తం 13మంది నిందితులపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు పలు కేసుల్లో చార్జ్‌షీట్ రూపొందించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో పది హైరైజ్డ్ టవర్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సాహితీ యాజమాన్యం 17వందలకు పైగా కస్టమర్ల నుంచి రూ.500కోట్లు వసూలు చేసింది. ఇలా 9 ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3000కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి.