పాఠశాల అంటే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన నిలయం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఆశా కిరణం. కానీ కొన్ని స్కూళ్లలో ఆ చిట్టి చేతులతో చెత్త ఎత్తించడం, ఊడిపించడం, మెట్లు తుడిపించడం వంటి పనులు చేయిస్తున్నారు. మెట్లు ఎక్కుతూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన ఆ విద్యార్థి అదే మెట్లను ఊడుస్తూ కిందికి దిగుతున్న వైనం.. వాళ్ల చేతిలో పుస్తకం కాదు.. చీపురు.. మనసులో కలలు కాదు.. టీచర్లు విధించిన పని.. ఇది విద్యావ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతున్నది.. చదువు నేర్పాల్సిన పాఠశాలల్లో విద్యార్థులను కూలి పనులకు వినియోగించడం చట్ట విరుద్దమని తెలిసినా.. ఇంకా కొన్ని చోట్ల ఈ అమానుష పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల హక్కులను కాలరాస్తూనే ఉన్నాయి. ఆ విద్యార్థులు తాము చదువుకోవడానికి వచ్చామా.. లేదా కూలి పనిచేయడానికి వచ్చామా అనే వారి ప్రశ్నకు జవాబు చెప్పేవారేరీ?
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)
పుస్తకం పట్టాల్సిన చేతిలో.. చీపురు
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలోని ఎన్సీసీ గేటు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిరోజూ విద్యార్థులను కూలీలుగా మలుస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో ఆ పిల్లలకు క్లాస్ నడుస్తున్నా.. మధ్యలో వచ్చి మెట్లు ఊడవాల్సిందేని స్కూల్ సిబ్బంది బెదిరిస్తున్నారని ఏడో తరగతి చదువుతున్న ఆ విద్యార్థులు చెబుతున్నారు. టీచర్లు దగ్గరుండి మరీ పనులు చేయిస్తుంటారని, చెయ్యకపోతే కొడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఓ టీచర్‌ను అడగ్గా.. ‘ఇక్కడ చదివే వారంతా వాచ్మెన్ పిల్లలు, కూలి పని చేసుకునే పిల్లలేనని వారికి ఈ పనులన్నీ అలవాటే.’ అని చెప్పడం టీచర్ కుసంస్కారానికి నిదర్శనం.
ఇలాంటి ఘటనలపై ప్రత్యేక తనిఖీలు చేయాల్సిన డీఈవో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పాఠశాలలో స్వీపర్లకు జీతాలు ఇవ్వడం లేదని ఆ పనులు విద్యార్థులతోనే చేయిస్తున్నట్టు తెలిసింది. ప్రధానోపాధ్యాయుడి కార్యాలయానికి ఎదురుగా ఉన్నమెట్లను విద్యార్థులతో శుభ్రంచేయించడంపై తల్లిదండ్రులు, బాలల హక్కుల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే కూలీలవుతున్న సంఘటనలు దర్శనమిస్తున్నాయి. చట్టాలు తెలిసినా, పర్యవేక్షించాల్సిన హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Hyd3
ప్రతి రోజు ఊడిపిస్తున్నారు..
హైదరాబాద్ పరిధిలో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. సగానికి పైగా పాఠశాలల్లో స్వీపర్లు లేరని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం తమతోనే ఉపాధ్యాయులు ఊడిపిస్తారని, చెత్త, మురుగు శుభ్రం చేయిస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్, బండ్లగూడ, బంజారాహిల్స్‌లోని పలు పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయి. చెత్త ఎత్తించడం, ఊడిపించడం, మెట్లు తుడిపించడం వంటి పనులు చేయిస్తున్నారు. ఇవన్నీ రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ -2009 ప్రకారం నిషేధించారు. పిల్లలను చదువుతో సంబంధం లేకుండా పనులకు ఉపయోగించడం, మానసిక వేధింపులు, బాలల హక్కులు ఉల్లంఘన కిందకు వస్తుందని చైల్డ్ రైట్స్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. చదువుపై ఆసక్తి కోల్పోయే ప్రమాదంపందని హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో శుభ్రత పనులు చేయడానికి స్వీపర్లు, అటెండర్లు ఉండాలి. అయినప్పటికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విద్యార్థులనే కూలీలుగా మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం
పాఠశాలల్లో విద్యార్థులను కూలీలుగా చూసే పరిస్థితి మంచిది కాదు. ఊడిపించడం, తట్ట ఎత్తించడం లాంటి పనులు చేయించకూడదు. అదివారి మనసుపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది. రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ చట్టం ఉన్నా బాలల హక్కుల చట్టాలు ఉన్నా పిల్లల చేతుల్లోకి చీపుర్లు, తట్టలు ఎలా వస్తున్నాయి? స్వీపర్లు ఉండాల్సిన చోట విద్యార్థులను కూలీలుగా మార్చిన వాళ్లెవరు? విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇతర విద్యార్థుల ముందర వారు తక్కువా అనే భావన కలిగి చదువు మానేసి పాఠశాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలతో పనిచేయించేవారిపై విద్యాహక్కు చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
– కవిత, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్