సిటీబ్యూరో/మణికొండ, మే 24: మణికొండ మున్సిపాలిటీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉండటంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే కూల్చివేతలను ఆపాలంటూ ‘పై’ స్థాయి నుంచి అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాగా, శుక్రవారం పంచవటి కాలనీలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.
ఒకవైపు కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే.. పలువురు బిల్డర్లు ఆపాలంటూ.. ప్రభుత్వంలోని పెద్దల నుంచి మణికొండ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారని అధికారులు తెలిపారు. బహిరంగంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి, ఆపై ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి కలిగిన వారికి తాము బంధువులమంటూ తమను భయబ్రాంతులకు గురియచేస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ఒకవైపు ఒత్తిళ్లు కొనసాగుతున్నా హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ స్పష్టం చేశారు. పంచవటి కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న 35 నిర్మాణాలను గుర్తించామన్నారు. శుక్రవారం మూడు అక్రమ నిర్మాణాల స్లాబ్‌లను కూల్చివేసినట్లు వివరించారు.
ప్రభుత్వం నుంచి జీప్లస్ 3 అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఐదు అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటివవారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను గుర్తిస్తే వాటిని కూల్చివేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.