Amberpet | అంబర్‌పేట, జూలై 6 : అంబర్‌పేట మండల కార్యాలయం నుంచి పటేల్‌నగర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఎడమవైపున అక్రమ పార్కింగ్తో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరుపడితే వారు ఇష్టారాజ్యంగా కార్లను, ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో పెద్ద వాహనం ఏదైనా వస్తే మిగతా చిన్న చిన్న వాహనాలు పోవడానికి ఇబ్బంది ఎదురవుతోంది. ఇటీవలనే ఈ వాహనాల పార్కింగ్ ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. అంబర్‌పేట మండల కార్యాలయం నుంచి సీపీఎల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరకు ఇంతకుముందు ఎవరు కూడా పార్కింగ్ చేసేవారు కాదని, ఇప్పడు అక్రమంగా కార్లను పార్కింగ్ చేస్తున్నారని అంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పటేల్‌నగర్ చౌరస్తా వరకు కూడా కార్లను, ఇతర వాహనాలను ఇష్టం వచ్చినట్లు నిలుపుతున్నారని చెప్పారు. ఇక్కడ కూడా పార్కింగ్ సమస్య తలెత్తుతుందని తెలిపారు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు బాపూనగర్ నుంచి పటేల్‌నగర్ మీదుగా ప్రేమ్‌నగర్ గ్రీన్లాండ్ హోటల్ వరకు నాలాను గతంలో విస్తరించారు. దానిపై స్లాబు వేశారు. అది ట్రాఫిక్ లేకుండా వాహనాలు వెళ్లడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావించారు. కానీ ఆ విస్తరించిన నాలా స్లాబుపై ఇప్పడు కార్లు పార్కింగ్ చేస్తుండడంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు వారంలో రెండు రోజులు ఇక్కడ వారం వారం సంత నిర్వహిస్తుండడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, నరేంద్రనగర్, అహ్మద్‌నగర్, న్యూపటేల్నగర్, చెన్నారెడ్డినగర్, న్యూప్రేమ్ నగర్, బాపూనగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువ శాతం ఇదే రహదారి ద్వారా ప్రయాణం సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా బస్తీల ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.