మేడ్చల్, జూన్ 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలేరా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై నామా మాత్రపు చర్యల వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు మున్సిపల్, రెవెన్యూశాఖల సమన్వయలోపంతో ఫిర్యాదులు వచ్చినా.. ఇరు శాఖలు స్పందించకపోవడం మూలంగా అక్రమార్కులకు మరింత అవకాశం లభించినట్లవుతున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో 342 సర్వే నంబర్లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏకు ప్రభుత్వం కేటాయించింది. అయితే కేటాయించిన ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సి ఉండగా, పట్టించుకోకపోవడం మూలంగా కబ్జాలకు గురవుతూనే ఉన్నది. హెచ్ఎండీఏకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ కబ్జాదారులు నిరుపేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే తప్ప..అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితిలో లేరు.
అక్రమ నిర్మాణాలపై స్థానికులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే ఈ భూమిని ప్రభుత్వం ఎప్పుడో హెచ్ఎండీఏకు కేటాయించిందని తప్పించుకుంటున్నారు. హెచ్ఎండీఏ తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇస్తే ఏదో నామా మాత్రపు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అనేక అక్రమ నిర్మాణాలు జరగడంతో వాటిపై ఎలా చర్యలు తీసుకోవాలనే సందిగ్ధంలో అధికారులు ఉన్నారు. సెలవు రోజుల్లో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేసి.. అధికారులను మచ్చిక చేసుకొని.. ఇంటి నంబర్లను తీసుకుంటున్నారు.
గాజులరామారంలో కేటాయించిన 45 ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో ఎంత కబ్జాకు గురైందో తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు మ్యాపులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. హెచ్ఎండీ ఏభూమిలోప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తే కబ్జాలకు గురికాకుండా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
మూడు రోజుల కిందట అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్యాంప్రసాద్ గాజులరామారంలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాలని, తమకు సమాచారం అందించాలని రెవెన్యూ అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.