Ayyappa Society | సిటీబ్యూరో/మాదాపూర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలోని కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి పునాదులపై పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ భవనం నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఇప్పుడు జనాల్లో నెలకొన్నది. ఇందుకు ఇటీవల కాలంలో పుప్పాలగూడ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాద ఘటన, సిద్ధిక్‌నగర్‌లో ఒరిగిన నాలుగు అంతస్తుల నిర్మాణమే ఇందుకు నిదర్శనం.
ఈ జాబితాలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ చేరనున్నదా? ప్రమాదాల అంచుల్లో ఉన్నామంటూ స్థానికుల్లో ఆందోళన మొదలైందా? అంటే అవుననే చెబుతున్నారు. జీరో పర్మిషన్ల పేరిట అక్రమ దందాలో పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి కట్టినవే. గడిచిన కొన్ని నెలలుగా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో వెలిసిన అక్రమ భవన నిర్మాణాల్లో చాలా వరకు ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు నీళ్లొదిలారు. అడ్డగోలుగా సెల్లార్ తవ్వకాలు చేపట్టారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో అయ్యప్ప సొసైటీ ఉండటం…హాస్టళ్లు, హోటళ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కాలేజీలు ఇతర వాణిజ్య వ్యాపారాలకు డిమాండ్ దృష్ట్యా ఈ ప్రాంతంలో నిర్మాణాలకు డిమాండ్ ఏర్పడింది.
అయప్ప సొసైటీలో 200 గజాల నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్నది. అయ్యప్ప సొసైటీలో అనధికారికంగా నిర్మాణాలకు వెలకట్టి మరీ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కప్పం వసూలు చేస్తున్నట్లు బహిరంగ విమర్శ. ఇక్కడ జరిగే అక్రమ నిర్మాణాలకు స్థలం, విస్తీర్ణాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఫ్లోర్‌కు రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల మేర వసూలు చేస్తున్నట్లు అరోపణలు ఉన్నాయి. కప్పం కట్టిన భవనం జోలికి ఏ అధికారి వెళ్లరు అన్న చర్చ లేకపోలేదు. గడిచిన కొన్ని నెలలుగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి.
ఈ దందా వెనుక అధికారంలో ఉన్న కొందరు పెద్దలతో పాటు స్థానిక అధికారులు హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు పనిచేయడం లేదు. దీంతో గురుకుల్ ట్రస్ట్ భూములున్న అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా లే అవుట్లో ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. గురుకుల్ ట్రస్ట్ భూములపై న్యాయస్థానం స్టేటస్కో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు వీటికి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. జలమండలి అధికారులు నల్లా కనెక్షన్లు, విద్యుత్ అధికారులు కూడా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు.
ఖానామెట్‌లో గురుకుల్ ట్రస్ట్‌కు 625 ఎకరాలు ఉన్నాయి. బన్సీలాల్ అనే దాత సామాజిక కార్యక్రమాలకు, పేద విద్యార్థుల చదువుల కోసం ఈ భూములను దానంగా ఇచ్చారు. ఘట్కేసర్లోని గురుకుల్ ట్రస్ట్ ఆధీనంలో ఈ భూములు ఉండేవి. ఈ స్థలాన్ని అప్పట్లో ట్రస్ట్ సభ్యులు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. అయ్యప్ప సొసైటీ కూడా 125 ఎకరాల్లో ఏర్పడింది.
ఇందులో 1200 ప్లాట్లను ఉద్యోగులు , మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొనుగోలు చేశారు. అవి సీలింగ్ భూములని, అమ్మకాలు చెల్లవని అప్పట్లో ప్రభుత్వం నిర్మాణాలను అడ్డుకున్నది. ఈ భూముల క్రమబద్ధీకరణకు దేవాదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ భూములపై ప్రభుత్వానికి , ట్రస్ట్‌కు, సొసైటీలకు మధ్య సుప్రీంకోర్టులో వివాదం నడిచింది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. కానీ వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్నాయి.