Madhusudhana Chary | అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణిచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులను పెట్టారని తెలిపారు. మేం శాంతి ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్లో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఎవరిని అడిగి సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఇష్టారాజ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌ను టచ్ చేస్తే భస్మమే అని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరని మధుసూదనాచారి స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించారు. సర్కార్ ఇప్పటికైనా పోలీసులను వెనక్కి పంపించాలన్నారు. ద్రోహుల చెర నుంచి తెలంగాణను రక్షించుకున్న గడ్డ ఇది అని గుర్తుచేశారు.