హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సంఘీభావం తెలుపుతానని చెప్పారు. రైతులపైకి కాన్వాయ్‌ను దూకించి వారిని హత్య చేయడం ఘోరమైన నేరమని వ్యాఖ్యానించారు. ఈ నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రిని తొలగించాలని, ఇప్పటికైనా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, మరి కొన్ని నెలల్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ దృష్టిసారించారు. స్థానిక పార్టీలతో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యూపీలో జరుగున్న అన్ని పరిణామాలపై ఒవైసీ స్పందిస్తున్నారు.