మేడ్చల్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి… ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని, 10 హెచ్‌పీ మోటర్లు వాడాలని, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళన కల్గిస్తున్నవి. మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ధరణి వల్లే రైతులకు ఏడాదికి రెండు పంటలకు రైతుబంధు పెట్టుబడి సాయం అందుతున్నదని రైతులు పేర్కొన్నారు. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు వ్యవసాయాన్ని ఏమీ చేయాలని చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 24 గంటల కరెంట్‌తో 5 హెచ్‌పీ మోటర్తో పంటలకు నీళ్లను పారించుకుంటూ వ్యవసాయం పండగలా చేస్తుంటే..కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధరణి వల్లే రైతులకు మేలు
రైతులకు ధరణి వల్లే మేలు జరిగింది. ధరణిలో తమ భూములు నమోదై శాశ్వత హక్కులు వచ్చాయి. ఆన్లైన్లో భూములు ఎక్కడంతో ఎలాంటి కబ్జాలకు గురి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. ధరణి వల్ల రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయం తమ బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌పై రైతులందరికి విశ్వాసం ఉంది.
-మచ్చని శ్రీశైలం, రైతు, కీసర
ధరణితోనే బాధలు తప్పినయి..
కాంగ్రెస్ పార్టీ చెడగొట్టు పనులు చేసే విధంగా మాట్లాడుతోంది. ధరణి పోర్టల్ వల్ల రైతులకు మంచి జరిగితే కాంగ్రెస్ నాయకులకు మంచిగా అనిపిస్తలేదు. కాంగ్రెస్ మళ్లీ పటేల్, పట్వారీ కాలం నాటి రెవెన్యూ వ్వవస్థను తీసుకొచ్చేలా మాట్లాడుతున్నారు. అప్పట్లో పహణీ, నఖలుకు తాసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారం. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించినంక తమ భూములు ఆన్లైన్లో ఎక్కడం వల్ల ఇబ్బందులు తప్పినయి. ఇంత మంచి ధరణిని తీసేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం బాధాకరం.
– కొమిరెడ్డి ఇంద్రారెడ్డి, రైతు, ఎదులాబాద్
ధరణి ఎత్తేస్తే రైతులు ఆగమే..
ధరణి ఎత్తేస్తే రైతులు ఆగమవుతారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరణిలో ఎక్కిన పేర్లను తొలగిస్తామంటున్నారు. ధరణి ద్వారా తమ భూములకు భద్రత ఏర్పడింది. ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాలి. పాత రెవెన్యూ చట్టంతో తాము అనేక ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి రైతులకు న్యాయం చేసిండు. తమ భూములకు సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మంచి పని చేసిండు.
-చిలుగురి మంకయ్య, రైతు, మర్రిపల్లిగూడ
మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెస్తరట..
కాంగ్రెస్ నాయకులు మా పాలన వస్తే ధరణి తీసేసి వీఆర్వో వ్యవస్థ తెస్తమంటున్నరు. మళ్లీ పాత రోజులు, పాత విధానాలు తీసుకొస్తరట. పాతరోజుల్లో కొనాలన్నా, అమ్మాలన్నా చాలా ఇబ్బందులుండేవి. రిజిస్ట్రార్ ఆఫీసుకు బోతె గీకాయితం లేదుగా సంతకం లేదు అని గోస ఉంటుండే. మళ్లీ పాసుబుక్కుల కోసం తాసీల్దార్ ఆఫీసు చుట్టూ ఏండ్ల తరబడి తిరగాలి. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. ధరణి వచ్చినంక రాతకోతలు, పాసుబుక్కులు ఆన్లైన్ అయి ఒక్కతాన్నే జరుగుతున్నాయి. ధరణి పోర్టల్ కొనసాగాలె.
– కొల్తూరు లక్ష్మీనారాయణ, డి.పోచంపల్లి
భూములు కబ్జా అవుతాయి..
కాంగ్రెస్ ధరణి రద్దు చేసి పాత పద్ధతి తీసుకొస్తమంటున్నది. భూములకు పెరిగిన ధరలతో మునుపటి పద్ధతి ఉంటే మా భూములు రికార్డుల్లో పేరు మారి కబ్జా అవుతాయి. ఆఫీసుల చుట్టూ తిరుగుడు షురువైతది. పనులు కావు. ధరణి వచ్చినంక మేము తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్ర వేస్తే తప్ప భూమి రికార్డులు మారుతలేవు. పాసుపుస్తకాల్లో డిజిటల్ ప్రింటు రావడంతో తిప్పలు తప్పాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఎలాంటి చింత లేకుండా జీవిస్తున్నాం.
– కే. కృష్ణ, రైతు, నూతన్‌కల్, మేడ్చల్
ధరణి బంద్ జేస్తే రైతులకు గోసే..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి బంద్ జేస్తమని ఆ పార్టీ నాయకులంటున్నరు.మళ్లీ రెవెన్యూ ఆఫీసుకు పోయి పని చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. అధికారులు అక్కడ ఉన్నాం.. ఇక్కడ ఉన్నామంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటరు. ఇప్పుడు ధరణితో స్లాట్ బుక్ చేసుకుంటే ఎవరికి ఒక్క పైసా ఇవ్వకుండా పని జరిగిపోతుంది. రికార్డులన్నీ మారిపోతున్నాయి. ధరణి తీసేస్తే మళ్లీ అవినీతి పెరిగిపోతుంది.రైతులకు ఇబ్బందులు వస్తయి. భూముల వివరాలు సక్రమంగా ఉండవు.
– మల్లేశ్, మూడుచింతలపల్లి, మేడ్చల్ జిల్లా
కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలే..
రైతు గోస తెలిసినోడెవ్వడు 3 గంటల కరెంటు ముచ్చట మాట్లాడడు. 10 హెచ్‌పీ మోటర్ ఖర్చుతో కూడుకున్న పని. ఈ ప్రభుత్వానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. మూడు గంటల కరెంటు సంగతేందో అప్పుడే జూసినం. రాత్రొస్తదో పగలు వస్తదో తెలియదు. పొద్దు, మాపు బాయికాడనే పడిగాపులు కాయాలే. పురుగు, భూషి కానక కష్టాలు పడినం. రెండు రోజుల ఆదమరిస్తే పంట ఎండిపోయిది. గదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకా రైతుల గోస తప్పింది. 24 గంటల కరెంటు ఇస్తున్నరు.
– సింగిరెడ్డి నర్సింహారెడ్డి, తూంకుంట
3గంటల కరెంటుతో రైతుకు కన్నీళ్లే..
మూడు గంటల కరెంటు అంటే ఎవుసం మానుకోమన్నట్టే.ఆ కరెంటుతో రైతులకు కనీళ్లు తప్ప మిగిలేదేమీ లేదు. మూడు గంటలే అంటే 5 హెచ్‌పీకి బదులు 10 హెచ్‌పీ మోటర్ పెట్టాలే. జెర్ర లోడ్ ఎక్కువైందంటే మోటరు, వైరు, ఒక్కోసారి ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోతది.ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఎవుసం మానుకోని కంపెనీల సుట్టు తిరగాల్సి వస్తది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతోటి చేనుకు సరిపోను నీళ్లు పారపెట్టుకుంటున్నం.
– మైనబోయిన వెంకటస్వామి, శామీర్‌పేట
వ్యవసాయం ఖతమైతది..
కాంగ్రెస్ నాయకులన్న మూడుల గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్తో వ్యవసాయం చేస్తే రైతులు బాగుపడరు. మూడు గంటల కరెంట్‌తో పొలాలన్నీ ఎండిపోవడం ఖాయం. కరెంట్ మధ్యల పోవడంతో పారిన వరినారంతా ఎండి పోయి పగుళ్లు ఏర్పడుతుంది. రైతులందరు కాపు కాసి పారపెట్టాల్సి వస్తది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఎదురైన కరెంటు కష్టాలు గుర్తుకొస్తున్నాయి. రైతులందరూ ఒకేసారి కరెంట్ ఆన్ చేయడంతో ఉన్న మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడి ఇవి కూడా ఖాళీ పోతాయి. 3గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయాన్ని బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది.
– బోయిన జంగయ్య,రైతు, కీసర
కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దుర్మార్గం
కాంగ్రెస్ నాయకులు ఇస్తామన్న 3 గంటల కరెంట్‌తో వ్యవసాయం ఎలా చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి వ్యవసాయం పండుగ చేస్తున్నది. ధరణిపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటర్లు మాత్రమే నడుస్తాయి. 10 హెచ్‌పీ మోటర్లతో పంటల సాగు చేయడం కష్టం. కాంగ్రెస్ నాయకుల 3 గంటల కరెంట్ మాటలు వింటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.
– చెట్టి శంకరయ్య, రైతు, కీసర
10 హెచ్‌పీ మోటర్లు భారం
పొలంలో ఉన్న బోర్లకు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లే సరిపోతాయి. రైతులు ఈ మోటర్లనే వాడుతున్నరు. కాంగ్రెస్ నాయకులంటున్న 10హెచ్‌పీ లాంటి పెద్ద మోటర్లు ఎప్పుడు చూడలేదు, వాటిని వాడలేదు. ఇప్పుడున్న మోటర్లు బోర్లకు
సరిపోతున్నాయి. ఉన్న మోటర్ల ధరలే అధికంగా ఉండగా, ఇక పెద్ద మోటర్ల ధరల భారం మోయలేం. నిత్యం ఉంటున్న కరెంట్‌తో ఈ మోటర్లను నడిపించుకుని పొలం ఎండిపోకుండా పారపెట్టుకుంటున్నాం. మాకు ఏ పెద్ద మోటర్లు వద్దు.
– అన్నారం సంజీవ,కోనాయిపల్లి, మేడ్చల్ మండలం
10 హెచ్‌పీ భస్మాసుర హస్తం
కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నదే లేదు. విత్తనాల కోసం క్యూ కట్టిన దుస్థితి గుర్తు చేసుకుంటే కన్నీరే కారుతుంది. 10హెచ్‌పీ మోటర్ అంటూ కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే విడ్డూరంగా ఉంది. ఈ మోటర్‌కు ఖర్చు ఎక్కువైతది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24గంటలు ఉచితంగా కరెంటు, విత్తనాలు, ధాన్యం కొంటున్న సీఎం కేసీఆర్‌కే రైతుల మద్దతు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఎవుసం గురించి రేవంత్‌రెడ్డికి తెల్వదు.
– మహేశ్, రైతు నాయకుడు, బాలాజీనగర్