Harish Rao | మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవు అని అబద్ధం చెప్పిన సీఎం, కేటీఆర్ అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్ లో చూపించగానే నాలుక కరుచుకున్నారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతారు అని సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ లాక్కుని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కన్నెపల్లి మోటార్లు 93.5 మీటర్ల ఎత్తులో నడుస్తాయి. ప్రస్తుతం నదిలో లక్ష క్యూసెక్కుల వరద పోతోందన్నారు. నీటిమట్టం 97.5 మీటర్ల ఎత్తులో ఉంది. గేట్లు మూయాల్సిన అవసరమే లేదు. నిన్నటి దాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం.. ఇప్పుడు వాళ్లు నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఏనాడూ రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ ఫీజబుల్ కాదని చెప్పలేదు. మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని సాక్షాత్తూ వారే జస్టిస్ ఘోష్ కమిషన్కు అఫిడవిట్ ఇచ్చారు.
ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు సైతం కేవలం రూ. 8.5 కోట్ల ఖర్చుతో ఒక కాఫర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారు.కానీ నీళ్లు ఎత్తకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము చేసిన దుష్ప్రచారం ఎక్కడ బట్టబయలు అవుతుందో అన్న భయంతో రేవంత్ రెడ్డి ఈగోలకు పోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం. 2004లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా నా పేరు కూడా శిలాఫలకంపై ఉంది. 2014 వరకు రూ. 3,347 కోట్లు ఖర్చుపెట్టినా అందులో 5 టీఎంసీల నీళ్లు కూడా నిలపలేకపోయారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 18,700 ఎకరాల భూసేకరణ, 1448 ఇండ్ల ఆర్ అండ్ ఆర్ మాత్రమే జరిగింది.
హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరం..
తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించిందన్నారు హరీశ్ రావు. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చింది. 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో (20 టీఎంసీలు) వినియోగంలోకి తెచ్చింది. ఈరోజు ఎల్లంపల్లిలో కేవలం 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.ఎన్టీపీసీకి 5, సింగరేణికి 5, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరం. సీఎం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని సీఎం అంటున్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్లోనే కాంగ్రెస్ 30 ఏళ్లలో 46 వేల ఎకరాలకు ఇస్తే, మేము 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.2014-15లో రాష్ట్రంలో పండిన వరి కేవలం 68 లక్షల టన్నులు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023-24 నాటికి ఏకంగా 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ఘనత అన్నారు.