Tamil Nadu CM : తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ (C Josef Vijay) తన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే విద్యా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సీఎంగా కూడా కొనసాగించనున్నారు. 10, 12వ తరగతి స్టేట్ బోర్డ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన స్వయంగా సత్కరించనున్నారు. ఈ నెలాఖరున లేదా ఆగస్టు మొదటి వారంలో చెన్నై (Chennai) వేదికగా ఈ భారీ కార్యక్రమం జరగనుంది.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగడం ఇదే తొలిసారి. 2023లో టీవీకే పార్టీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు, ఇతర బహుమతులను అందజేస్తారు. ఈ వేడుకకు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు.
మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. అర్హులైన విద్యార్థులను గుర్తించి వారిని కార్యక్రమానికి తీసుకువచ్చే బాధ్యతలను పార్టీ జిల్లా కార్యదర్శులకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిచిపోవచ్చనే ఊహాగానాలు వెలువడినప్పటికీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదని, కేవలం టీవీకే పార్టీ తరపున వ్యక్తిగత చొరవతోనే కొనసాగుతుందని నాయకులు స్పష్టంచేశారు.