S.Janaki | భారతీయ సినీ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి తన గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. తెర వెనుక ఎంతో సాదాసీదాగా జీవించిన జానకమ్మది ప్రేమ వివాహం కావడం విశేషం. తన విజయవంతమైన సంగీత ప్రయాణంలో భర్త అందించిన సహకారం గురించి ఆమె పలు సందర్భాల్లో ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. జానకి తన కెరీర్ ప్రారంభ దశలోనే దగ్గరి బంధువుల కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అనుబంధంగా, తర్వాత ప్రేమగా మారింది.
తన ప్రేమకథ గురించి ఓ ఇంటర్వ్యూలో జానకి మాట్లాడుతూ, మాది ప్రేమ వివాహం. రాంప్రసాద్ గారు నన్ను ప్రేమించారు. నేను కూడా ఆయనను ప్రేమించాను. కానీ మొదట్లో అది ప్రేమ అని నాకు తెలియలేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఎవరికీ తెలియకుండా ఆయన ఫోటోను సంపాదించి నా దగ్గర దాచుకుని ఉంచుకున్నాను. బయట మాత్రం ఏమీ తెలియనట్లు ఉండేదాన్ని అని గుర్తుచేసుకున్నారు.ఈమె దాచుకున్న ఫోటో ఒకరోజు ఇంట్లో వారి కంటపడటంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో పెద్దల అంగీకారంతో ఇద్దరి వివాహం జరిగింది. తన జీవితంలో సాధించిన ప్రతి విజయానికి భర్త రాంప్రసాద్ కారణమని జానకి ఎన్నోసార్లు చెప్పారు. ఒకే రోజు నాలుగు స్టూడియోలకు వెళ్లి, వేర్వేరు భాషల్లో పాటలు పాడాల్సిన పరిస్థితులు ఉండేవని, ఆ సమయంలో అన్ని వ్యవహారాలను భర్తే చూసుకునేవారని ఆమె వివరించారు.
రికార్డింగ్‌లు, పారితోషికం, తేదీలు, ఒప్పందాలు వంటి విషయాల్లో తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భర్త చూసుకునేవారని చెప్పారు.నేను ప్రశాంతంగా పాటలు పాడేందుకు అవసరమైన వాతావరణాన్ని ఆయనే కల్పించారు. నా మీద వచ్చే ఒత్తిడి అంతా ఆయనే భరించేవారు అంటూ జానకమ్మ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జానకి చెప్పిన మాటలు ఎంతో హృదయాన్ని తాకుతాయి. ఆయనను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. సిగరెట్ తాగి వస్తానని బయటకు వెళ్లినా ‘వద్దు’ అనేదాన్ని. కొన్నిసార్లు వెళ్లినా సగం దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేవారు. మా మధ్య అంతటి అనుబంధం ఉండేది అని ఆమె చెప్పారు. అలాగే తన అత్త శకుంతలాబాయి కూడా తనకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. రికార్డింగ్‌ల సమయంలో తన కుమారుడిని చూసుకోవడం నుంచి కుటుంబ బాధ్యతల వరకు అన్నింటినీ అత్తగారే చూసుకునేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.
జానకి దంపతులకు ఒక కుమారుడు మురళీకృష్ణ ఉన్నాడు. ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కుటుంబంలో కోడలు ఉమ ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం నర్తకిగా గుర్తింపు పొందారు. ఆమెకు ‘కలైమామణి’ పురస్కారం కూడా లభించింది. జానకికి అమృతవర్షిణి, అప్సర అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. భర్తపై తనకున్న ప్రేమను గుర్తు చేసుకుంటూ జానకి చెప్పిన మాటలు ఎంతో భావోద్వేగానికి గురిచేస్తాయి. నేను నా భర్త చేతుల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని దేవుడిని కోరుకునేదాన్ని. కానీ విధి మరోలా నిర్ణయించింది. నాకంటే ముందే ఆయనే వెళ్లిపోయారు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
రాంప్రసాద్‌కు మొదటిసారి గుండెపోటు వచ్చిన సమయంలో ఆయన ఆస్పత్రిలో ఉండగా, తాను మాత్రం రికార్డింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని జానకి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కార్తీకదీపం సినిమా కోసం “నీ చేతులలో తలవాల్చి… అనే పాటను భర్తనే తలచుకుంటూ ఎంతో భావోద్వేగంతో పాడానని తెలిపారు.తన భర్త మరణం జానకి జీవితంలో తీరని లోటుగా మిగిలింది. ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఇటీవల తన కుమారుడు మురళీకృష్ణను కూడా కోల్పోవడం ఆమెను మరింత కుంగదీసింది. జీవితాంతం సంగీతానికే అంకితమైన జానకమ్మ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ తన గానంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.