బంజారాహిల్స్, ఫిబ్రవరి 11: జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో అపోలో ఆస్పత్రి వెనక గేటు సమీపంలో జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించడంతో పాటు విల్లాలకు చెందిన సెట్‌బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నం.550లో నాలుగు విల్లాలను ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే అధిక అద్దెల కోసం ఆశపడిన ఇంటి యజమాని నిబంధనలను ఉల్లంఘిస్తూ విల్లాలను అనుకుని ఉన్న సెట్‌బ్యాక్ స్థలంలో మూడంతస్తుల మేర అక్రమ నిర్మాణం చేశాడు.
సదరు విల్లాలను ఆనుకుని ఉన్న జీహెచ్ఎంసీకి చెందిన సుమారు 1500 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని గేటు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పదిహేను రోజుల క్రితం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ ఆక్రమణలను తొలగించకపోవడంతో ఈ వ్యవహారాన్ని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి సెట్‌బ్యాక్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో పాటు పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.