Hydraa | హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. కూకట్పల్లి నల్లచెరువులో అనధికారిక షెడ్లను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. నల్లచెరువులోని సర్వే నెంబర్ 66, 67, 68, 69లోని షెడ్లను కూల్చివేశామని.. 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు నేలమట్టం చేసినట్లు పేర్కొంది. నల్లచెరువు పరిధిలో నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. సంగారెడ్డి అమీన్పూర్ మండలంలో ఆక్రమణలు కూల్చివేశామని వెల్లడించింది.
ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాలను కూల్చివేసినట్లు పేర్కొంది. కిష్టారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 164లో మూడు భవనాలు కూల్చివేశామని.. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న భవనాన్ని నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. కిష్టారెడ్డిపేటలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. పటేల్‌గూడలో 25 అక్రమణ నిర్మాణాలను నేలమట్టం చేశామని.. సర్వే నంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాల కూల్చివేత చేపట్టినట్లు చెప్పింది. పటేల్‌గూడలో మూడెకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నామని.. మూడు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేసినట్లు వివరించింది.