HYDRAA | కొండాపూర్, మార్చి 20 : గంగారం పెద్ద చెరువు కబ్జాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన ఆరోపణలపై గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. చెరువులో మట్టిని నింపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా చెరువులో మట్టినింపుతూ.. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చందానగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కబ్జాదారులు ముందుగా మట్టిని నింపి అటుపై ఆక్రమణలతో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెరువు కబ్జాలపై చేసిన ఆరోపణల నేపథ్యంలో పరిశీలిస్తున్నట్లు ఆయన అన్నారు. చెరువులోని కబ్జాలపై పూర్తి వివరాలు తెలుసుకుని, తొలగించి అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. హైడ్రా కమిషనర్ తోపాటు చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.