సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, అక్రమ నిర్మాణాలని ఇండ్లు, పలు భవంతులను కూల్చి సామాన్యుల జీవితాలను చిన్నా భిన్నం చేసిన హైడ్రా (కాంగ్రెస్ ప్రభుత్వం) శిథిలాల తరలింపునకు ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టింది. హైడ్రా ఆక్రమణల తొలగింపు నుంచి ప్రభుత్వం ఖాళీ స్థలాల కోసం అన్వేషిస్తోంది. కూల్చివేతల శిథిలాల తరలింపు కోసం ఖాళీ జాగా ఎక్కడుందా? అని రెవెన్యూ సహకారంతో వెతుకుతోంది.
పక్కా ప్రణాళిక లేకుండా హడావిడిగా చేసిన పని ఇప్పుడు హైడ్రాను కలవరపెడ్తోంది. హైదరాబాద్‌లో పలు చెరువులు, కుంటలు, పార్కుల వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతల శిథిలాల తరలింపు ప్రక్రియ ఇప్పుడు ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. హైడ్రా 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసింది. సున్నం చెరువు, నల్ల చెరువు, అప్ప చెరువు.. ఇలా కూల్చిన ప్రతిచోటా శిథిలాలు అలాగే పడి ఉన్నాయి. కూల్చివేతలకు సంబంధించి శిథిలాల తొలగింపు ప్రక్రియపై హైడ్రా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఎలాంటి ప్లానింగ్ లేకుండా కూల్చివేతలే లక్ష్యంగా సామాన్యుల నిర్మాణాలపై బుల్డోజర్లను పంపింది.
ఇదంతా రెండు నెలల్లో జరిగిన ప్రక్రియ. కోర్టు జోక్యంతో హైడ్రా తాత్కాలికంగా ఆగినా.. కూల్చివేతలకు సంబంధించిన శిథిలాలు అందునా పెద్ద పెద్ద దూలాలు, కర్రలు, పెద్ద రాళ్లు ఎక్కడివక్కడే పడేసి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శిథిలాల తొలగింపునకు సంబంధించి సెప్టెంబర్‌లో హైడ్రా టెండర్లను పిలిచినా.., వాటికి సంబంధించి ఇప్పటివరకు ఏ కంపెనీ ఫైనల్ కాకపోవడంతో ఇక తమ పరిధిలోనే తొలగింపు ప్రక్రియ చేపట్టింది. శిథిలాల తొలగింపు, తరలింపునకు సంబంధించిన వ్యయాన్ని నిర్మాణదారులే భరించాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయితే, శిథిలాలు ఎక్కడ పోయాలనేది మాత్రం ఇప్పటివరకు తేల్చుకోలేకపోవడంతో తరలింపు ప్రక్రియ ఎక్కడిదక్కడే
నిలిచిపోయింది.
హైడ్రా బృందం చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాలు ఎఫ్టీఎల్లో కట్టడాలను, పార్కు స్థలాల్లో వెలిసిన పలు నిర్మాణాలు నేలమట్టం చేశారు. లోటస్ పాండ్, మన్సురాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గాజుల రామారం, బాచుపల్లి, చందానగర్, రాజేంద్రనగర్, ఆమీర్‌పేట, అమీన్పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేటలలో కట్టడాలు కూల్చడంతో భారీగా నిర్మాణ వ్యర్థాలు పోగయ్యాయి. వీటిని తరలించడానికి కోట్ల రూపాయలు కావాలి. కూల్చిన చెరువుల దగ్గర ఫెన్సింగ్ చేస్తేనే తిరిగి ఆక్రమణలు జరగవని హైడ్రా అధికారులు అంటున్నారు.
కుంచించుకుపోయిన వాటిని పునరుద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ ఆకారాన్ని తీసుకురావలసి ఉంది. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా వద్ద నిధుల్లేవు. ఆర్ఆర్ చట్టం కింద నిర్మాణ వ్యర్థాలను తరలించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేయడానికి హైడ్రా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎర్రగుంట చెరువు వద్ద కూల్చేసిన భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే క్రమంలో బిల్డర్ తనకు సంబంధించిన విలువైన వస్తువులను హైడ్రా బృందం తరలిస్తుందంటూ వీడియో వైరల్ చేశారు.
దీంతో ఆ తుక్కు తరలించడమే కాకుండా అది అమ్మగా పోను మిగతా వ్యయాన్ని బిల్డర్ దగ్గర నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయితే, శిథిలాలను ఎక్కడ వేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒక్క ఎర్రగుంట చెరువు వద్ద కూల్చేసిన వ్యర్థాలను తరలించాలంటేనే చాలా కష్టమైంది. ఇక మిగిలిన చోట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై హైడ్రా బృందం తర్జనభర్జన పడుతున్నారు.
ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉండి అక్కడ కూల్చివేతల శిథిలాలు పోసే అవకాశముంటుందా? అనే దిశగా ఆయా ప్రాంతాల ఎమ్మార్వోలతో హైడ్రా బృందం చర్చిస్తోంది. అయితే, స్థలాల ఎంపిక ప్రక్రియే ప్రస్తుతం హైడ్రాకు పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా కూడా సర్వే చేసినట్లు తెలిసింది. శిథిలాలను పోయడానికి కావలసిన స్థలం కోసం ప్రస్తుతం హైడ్రా బృందం ప్రయత్నిస్తోంది. తాము బెంగళూరు స్టడీటూర్ వెళ్లి వచ్చేలోగా కనీసం నాలుగు చెరువులకు సంబంధించిన వ్యర్థాలను పోయడానికి అనువైన స్థలం కావాలంటూ రెవెన్యూ అదికారులకు కమిషనర్ చెప్పారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ జరిగితేనే చెరువుల సుందరీకరణ సాధ్యమవుతుంది.
కూల్చివేతలు, తొలగింపులకు సంబంధించి హైడ్రా సెప్టెంబర్ నెలలో ఆఫ్‌లైన్ టెండర్లను పిలిచింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27తో ముగిసింది. అయితే, ఇప్పటివరకు ఏ సంస్థకు టెండర్లు ఫైనల్ కాలేదని తెలిసింది. మూడు నెలల కాలంలో హైడ్రా జరిపిన కూల్చివేతలకు సంబంధించిన శిథిలాలు ఎక్కడివక్కడే పడేసి ఉన్నాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ పెద్ద టాస్క్‌గా మారింది. కూల్చివేతలతో పాటు శిథిలాలను తరలించే ప్రక్రియకు సంబంధించే టెండర్లను పిలిచినప్పటికీ కంపెనీలు ఏవీ సుముఖంగా లేకపోవడంతో హైడ్రానే ముందుగా ఎర్రగుంట చెరువు వద్ద తరలింపు ప్రక్రియ చేపట్టింది.
కానీ, ఈ తరలింపులో ఇబ్బందులున్నట్లు గమనించింది. శిథిలాలను ఎక్కడ పోయాలో తెలియక ఎర్రగుంట వద్ద తరలింపు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. తాము చెప్పినట్లుగా ఎర్రగుంట చెరువు, సున్నం చెరువు, అప్ప చెరువు, నల్ల చెరువులను ఆరు నెలల్లో సుందరీకరించడానికి మొదటి ఘట్టమే అక్కడ కూల్చివేసిన నిర్మాణ వ్యర్థాలను తరలించడం. ఇదే ఆలస్యమవుతుండంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ బృందంతో పాటు రెవెన్యూ, ఇతర శాఖలతో సమావేశమయ్యారు. తమ పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలున్నాయో చెప్పాలని, నిర్మాణ వ్యర్థాలు పోసే అవకాశముంటుందా? లేదా? కూడా ఫైనలైజ్ చేయాలని చెప్పినట్లు సమాచారం. వచ్చే వారంలో తాము బెంగళూరు స్టడీ టూర్‌కు వెళ్లివచ్చే లోగా స్థలాల ఎంపిక జరగాలని కమిషనర్ చెప్పినట్లు
తెలిసింది.