చాంద్రాయణగుట్ట, 19 (నమస్తే తెలంగాణ): తమదే భూమి అని చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులు, రెమెన్యూ అధికారులకు మధ్య ఓ భూ వివాదం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ శుక్రవారం ఉదయం భూమి చూట్టు ఫెన్సింగ్ వేస్తామని హైడ్రా అధికారులు బుల్డోజర్, జేసీపీలతో వచ్చారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా 100 కోట్లకు పైగా ధర పలికే విలువైన భూమిపైకి ఎవరూ రావొద్దని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ హైడ్రా అధికారులు ఎలా వస్తారని కోర్టులో కేసు వేసిన వారు ప్రశ్నించారు. మీ వద్ద ఏమైనా ఆర్డర్ కాఫీ ఉందా? అని నిలదీశారు.
ముందుగా ప్రభుత్వం లేదా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉంటే చూపించి ఫెన్సింగ్ వేయండి అని అడ్డుకున్నారు. సున్నితమైన ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే మా దగ్గర ఎలాంటి ఆర్డర్ లేదని, అయితే కోర్టులో కేసు ఉండగానే ప్రైవేట్ వ్యక్తులు 2 ఎకరాలకు పైగా కబ్జా చేసి, నివాసాలను ఏర్పాటు చేసుకున్నారని, ఇలాగే వదిలేస్తే ఉన్న భూమి కూడా కబ్జా అవుతుందని హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమల్లేష్ అన్నారు. భవిష్యత్‌లో హైకోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తే వారే భూమిని స్వాధీనం చేసుకుంటారని, అప్పటి వరకు ఫెన్సింగ్ వేసి భూమి కబ్జా కాకుండా కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు.
బండ్లగూడ మండలం కందికల్‌గేట్ గ్రామ పరిధిలో పాత సర్వే నెంబర్ 19/140లో ఆర్.శ్రీశైలం కుటుంబ సభ్యులకు 9ఎకరాల 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే 1982లో పాత సర్వే నెంబర్ స్థానంలో కొత్తగా టౌన్ సర్వేలో ఈ భూమి సర్వే నెంబర్ 310/1/2 గా చూపిస్తూ రెమెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీంతో నివ్వెరబోయిన భూమి యాజమనులు రెమెన్యూ రికార్డుల్లో పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తుందని, రికార్డులను సరి చేయాలని పలుమార్లు మండల కార్యాలయంలో ఆర్జీ పెట్టుకున్నారు. అయినప్పటికీ రెమెన్యూ అధికారులు స్పందించకపోవడంతో 2010లో పట్టా భూమి స్థానంలో ప్రభుత్వ భూమిగా రికార్డులను తప్పుగా రాశారని, రికార్డులను సరి చేయాలని కోరుతూ రెమెన్యూ అధికారులపై ఆర్.శ్రీశైలం హైకోర్టులో కేసు వేశారు. హై కోర్టు 2011లో భూమిపైకి ఎవరూ వెళ్లొద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో యాధావిధిగా కేసు కోర్టులో కొనసాగుతున్నది.
హైదరాబాద్ నాంపల్లి సంగీత్ నగర్లో నివసించే పట్టాభి రాంరెడ్డి(58) అనే వ్యక్తి సర్వే నెంబర్ 310/1/2లో 9ఎకరాల 11 గుంటల భూమి తనదేనంటూ రెమెన్యూ అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. ఆర్.శ్రీశైలం కుటుంబ సభ్యులు 1980లోనే జీపీఏ ద్వారా తనకు విక్రయించారని భూమిపై కబ్జాకు వచ్చారు. దీంతో అప్పట్లో భావానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పట్టాభిరాంరెడ్డి అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత భూమి తనదేనంటూ హైకోర్టులో పట్టాభిరాం నాలుగు కేసులు వేశాడు. ఆ తరువాత అతను మరణించడంతో ఆయన కుమారుడు వెంకట్రామిరెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈయన కూడా నాలుగు కేసులు వేశాడు. పూర్తి వివరాలు పరిశీలించిన హైకోర్టు 1981లో కొత్తగా సర్వే నెంబర్లు వ్యవసాయ భూములకు కేటాయిస్తే మీరు ఓ ఏడాది ముందే అంటే 1980లోనే ఎలా ఆ సర్వే నెంబర్‌పై జీపీఏ చేసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. ఇలా కోర్టు సమయం వృథా చేయడంతో పాటు నకిలీ పత్రాలు సమర్పించి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ వెంకట్రామిరెడ్డికి 2025 మార్చి నెలలో రూ.కోటి జరిమానా విధించింది.
శుక్రవారం ఉదయం నుంచి సర్వే నెంబర్ 310/1/2లో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమల్లేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితులపై ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ బండ్లగూడ మండల అధికారులను ఆరా తీయగా అసలు తమకు ఎలాంటి సమాచారం లేదని.. హైడ్రా అధికారులు భూమి చూట్టూ ఫెన్సింగ్ వేయడానికి వచ్చినట్లు బయటి వ్యక్తుల నుంచి తెలుసుకున్నామని మండల డిప్యూటీ తహసీల్దార్ రాధిక తెలపడం గమనార్హం. మాకు కూడా సమాచారం ఉంటే బాగుండేదన్నారు. హైడ్రా అధికారులు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదని, ప్రస్తుతం మండల తహసీల్దార్ కె.ప్రవీణ్ కుమార్ మీటింగ్‌లో ఉన్నారని, ఆయన దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ తహసీల్దార్ రాధిక తెలిపారు.