HYDRAA | సిటీబ్యూరో: జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు హద్దులు నిర్ధారించడానికి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది. సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సహకారంతో అప్పటి మ్యాప్స్ ఆధారంగా వాస్తవ విస్తీర్ణాన్ని కనుగొనేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్వే అధికారులు, శాస్త్రవేత్తలు ఇటీవలే 56 చెరువులకు సంబంధించిన మ్యాపులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జంట జలాశయాల పక్కా హద్దులను నిర్ధారించడానికి మ్యాపులు కావాలంటూ కోరారు. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కనిపెట్టనున్నారు. మొదట హిమాయత్‌సాగర్, ఆ తర్వాత ఉస్మాన్‌సాగర్‌లో ఈ సర్వే జరుగుతుంది.