అంబర్‌పేటలో బతుకమ్మ కుంట వ్యవహారం.. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆక్రమణదారుడు అంటూ పదేపదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఆరోపణలు చేశారు. చివరకు ఆయనకు గజం భూమిపై పట్టా లేదంటూ టైటిల్‌పై కోర్టులో కేసు పెండింగులో ఉండగానే మీడియా ముందు తీర్పు ఇచ్చారు.
అమీన్పూర్లో కూల్చివేతల సమయం.. అడ్వకేట్ ఎంఏ ముఖీమ్ పెద్ద కబ్జాకోరు అంటూ హైడ్రా పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. ఆయనపై గతంలో 19కి పైగా కేసులు నమోదయ్యాయంటూ చిట్టాను సమగ్రంగా అందులో పొందుపరిచింది.

మహానగరంలో 22 నెలలుగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి అనేక మంది పేర్లను ప్రకటించింది. కానీ మంగళవారం జరిగిన కూల్చివేతల్లో మాత్రం భిన్న వైఖరి కనిపించింది. కేవలం గంటల వ్యవధిలోనే పొంతనలేని ప్రకటనలు విడుదల చేసింది. సాక్షాత్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ పేరును మొదటి ప్రకటనలో వెల్లడించి..ఆ వెంటనే ఆ కంపెనీ తరపున ఉన్న వివరణను హైడ్రా అధికారిక వ్యాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. అసలు ఆ క్రషర్కు రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధంలేదని నిరూపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. మరి.. ఇదే వైఖరి ఇతరులపై ఎందుకు ఉండదు? పైగా మంగళవారం హైడ్రా కూల్చిన క్రషర్లపై రెండు పర్యాయాలు ప్రకటనలు విడుదల చేసింది. ఇందులో పలు ప్రభుత్వ శాఖల ఫిర్యాదుల మేరకే తాము ఈ కూల్చివేతలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ చెప్పే వివరణ సమంజసమైతే అసలు ఆయా శాఖలు ఇచ్చిన ఫిర్యాదులో ఏముందనే వివరాలను మొదటి ప్రకటిస్తామని చెప్పిన హైడ్రా ఆపై గోప్యత పాటించడమంటేనే ‘దాల్మే కుచ్ కాలాహై!’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 5 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు అందరూ సమానమేనంటూ తరచూ కమిషనర్ రంగనాథ్ చెబుతూ ఉంటారు. కానీ తరచూ చోటు చేసుకుంటున్న పరిణామాల్లో మాత్రం అధికారపక్షం అధికారపక్షమే… విపక్షాలు, సామాన్యులు ఇతరులే అన్నట్లుగా స్పష్టమవుతుంది. గతంలోనే ఇందుకు అనేక ఉదాహరణలు ఉండగా… తాజాగా మంగళవారం రంగారెడ్డి జిల్లాలో హైడ్రా చేపట్టిన క్రషర్ల కూల్చివేతల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందిన క్రషర్‌పై ఎంత దుమారం రేగిందో? మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ మైనింగ్ కుంభకోణాన్ని శాసనసభ వేదికగా బట్టబయలు చేసినపుడు సభ ఎలా దద్దరిల్లిందో లోకం మొత్తం చూసింది. పైగా అధికారికంగా రాఘవ కన్స్ట్రక్షన్స్కు జరిమానా విధించడంతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీలోనే రాఘవ క్రషర్ అక్రమాలపై విచారణ నిర్వహిస్తామని అంగీకరించారు.
ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది జనవరిలోనే ఆ క్రషర్ క్లోజింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హైడ్రా కూల్చివేసిన మంగళవారం వరకు కూడా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరగడం గమనార్హం. ఈ నెల 3వ తేదీన విద్యుత్ మీటర్ రీడింగ్ తీయగా.. 1965 యూనిట్లకుగాను రూ.22,171 బిల్లును జారీ చేశారు. ఈ నెల 17వ తేదీలోగా చెల్లించాలని గడువు తేదీ కూడా అందులో పొందుపరిచారు. అంటే అసెంబ్లీలో రచ్చ జరిగిన తర్వాత కూడా యథేచ్ఛగా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగాయని అర్థమవుతుంది. అయితే మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు ఈ క్రషర్‌తో పాటు మరో నాలుగు క్రషర్లను కూడా అనుమతులులేవని కూల్చివేశారు. అనంతరం ఎప్పటిలాగే పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.

లేఖను పోస్టు చేయడంపైనే చర్చ…
హైడ్రా ఇంతకాలం చేపట్టిన కూల్చివేతల సందర్భంగా ప్రదర్శించిన దూకుడు మంగళవారం మాత్రం ఒక్కసారిగా రివర్స్కావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి సందర్భంలోనూ సామాన్యుడు మొదలు ప్రముఖుల విషయంలోనూ కబ్జాదారులంటూ నేరుగా ప్రకటనల్లో అభివర్ణించారు. అవసరమైతే వాళ్లపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయో కూడా శోధించి.. వాళ్లకు నేర ప్రవృత్తి ఉందనే రీతిలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన దాఖలాలు అనేకం. కానీ మంగళవారం రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును విడుదల చేసిందే హైడ్రా. పైగా బడా బాబుల పైరవీలు, అండ అని కూడా పేర్కొంది. కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలున్నాయని కూడా స్పష్టం చేసింది. కానీ ఎందుకో మరి ఆ వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
అయితే ముఖ్యంగా కొత్వాల్గూడలోనిది రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధంలేదని హైడ్రా నిర్ధారించుకుంటే సమాచారలోపంతో ఆ పేరు వచ్చిందని పేర్కొంటే సరిపోయేది. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ గత మార్చిలో మైనింగ్ శాఖకు రాసిన లేఖను పోస్టు చేయడమే అందరిని విస్మయానికి గురి చేసింది. ఒక ప్రైవేటు కంపెనీ తరపున హైడ్రా వకాల్తా పుచ్చుకోవడమంటే అధికారంలో ఉన్న వారికి ఒకలా! సామాన్యుడి విషయంలో మరోలా వ్యవహరిస్తుందనేందుకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎవరా బడాబాబులు..?
క్రషర్ల కూల్చివేతలపై హైడ్రా ఉదయం 9.30 గంటలకు తొలి ప్రకటన విడుదల చేసింది. అందులో స్పష్టంగా బడాబాబుల అండతో… బడాబాబుల పైరవీలతో కొనసాగుతున్న అక్రమ క్రషర్లు అని స్పష్టంగా అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వీటిని కూల్చివేయాలని విజ్ఞప్తి చేసినందున హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. అంతేకాదు.. గౌలిదొడ్డి, వట్టినాగులపల్లిలోని క్రషర్ల పేర్లను పేర్కొంటూనే.. కొత్వాల్‌గూడలో రాఘవ స్టోన్ క్రషర్ అని స్పష్టం చేశారు. రెవెన్యూ, , పీసీబీ, మైనింగ్ అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు చేపట్టామని, కలెక్టర్ చేసిన ఫిర్యాదు కాపీలను కూడా మీడియాకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ మధ్యాహ్నం 12.06 గంటలకు సీన్ మారిపోయింది.
నేరుగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక లేఖను పోస్టు చేస్తూ కొత్వాల్‌గూడలోని క్రషర్ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందినదని, ఈ విషయంలో సమాచార లోపం ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతరం దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో పాటు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించి హైడ్రా తీరును ఎండగట్టింది. దీంతో చివరకు సాయంత్రం 6.09 గంటలకు హైడ్రా అధికారికంగా మరో ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎవరి పేర్లు పేర్కొనకుండా, రెవెన్యూ ఫిర్యాదుల మేరకు కూల్చామని పునరుద్ఘాటించింది. చివరకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా వాటి కోసం ప్రయత్నించినా రెవెన్యూ అధికారులతో పాటు హైడ్రా కూడా గోప్యత పాటించిందే తప్ప ఇవ్వకపోవడం గమనార్హం.