HYDRAA | హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరుపెట్టిస్తున్నది. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలతో మల్లంపేట, మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాలన్నీ గరీబోడి ఆవేదన.. రోదనలతో ప్రతిధ్వనించాయి. నిరాహార దీక్ష చేసి కేసీఆర్ నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తే.. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పేదలను పీడిస్తున్నారంటూ.. బాధితులు గగ్గోలు పెట్టారు. తమ బతుకులు రోడ్డుపై పడుతున్నా.. ముఖ్యమంత్రి కనికరించడం లేదని కన్నీరుపెట్టుకున్నారు.
అసమర్థ ప్రభుత్వంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే పేదలంతా నిల్వనీడలేకుండాపోయిందంటూ.. గుండెలు బాదుకున్నా.. పోలీసులు లాగిపడేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇన్నాళ్లు నీడనిచ్చిన గూడు ఇకపై ఉండదనే ఆవేదనలో ఓ మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. హైడ్రా కూల్చివేతలు పేదోడి పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-దుండిగల్/మాదాపూర్, సెప్టెంబర్ 8
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్/ఎఫ్టీఎల్ జోన్లలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను నేలమట్టం చేసింది. విల్లాల యజమానులకు ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడంతో నివాసితుల్లో ఆందోళన వ్యక్తమైంది. అలాగే చందానగర్ సర్కిల్ పరిధిలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాదాపూర్ సున్నం చెరువును 2013 హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేసి 4805 ఐడీ నంబర్‌ను కేటాయించారు.
2014లో ఎఫ్టీఎల్ ఖరారు చేసి ఫెన్సింగ్ చేశారు. అయితే కొంతకాలంగా ఆక్రమణదారులు ఎఫ్టీఎల్ మట్టిని నింపుతూ.. నెమ్మదిగా చెరువును కబ్జా చేస్తూ షెడ్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ షెడ్లలో పేదలు నివాసముంటున్నారు. ఆక్రమణల పేరుతో అందులో నివాసముంటున్న పేదలపై హైడ్రా ఆదివారం తెల్లవారుజామున బుల్డోజర్లతో విరుచుకుపడింది. ఉన్నపళంగా నిల్వనీడ లేకుండా చేయడంతో… ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. హైడ్రా ముసుగులో పేదల పొట్టను కొట్టే విధంగా వ్యవహరిస్తుందంటూ రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మరి కొంతమంది ‘మాకొద్దు ఈ రేవంత్ ప్రభుత్వం’ అంటూ నినాదాలు చేశారు.
అప్పటికప్పుడు మార్కింగ్
లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కు చెందిన ఏడు విల్లాలు మాత్రమే బఫర్ జోన్లోకి వస్తాయంటూ.. గతంలో అధికారులు నోటీసులు అందజేశారు. దీంతో ఆ నిర్మాణాల వైపు కొనుగోలుదారులు , నిర్మాణదారులు గానీ కన్నెత్తిచూడలేదు. అయితే ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేతలను చేపట్టిన సమయంలో వారితో పాటు కలిసి వచ్చిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు మరో 19 విల్లాలు సైతం బఫర్/ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తాయంటూ మార్కింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది.
ఇలా ప్రతి రెండేండ్లకు ఒకసారి బఫర్‌జోన్/ఎఫ్టీఎల్ మారుతుందా…?అంటూ స్థానికులు ప్రశ్నించారు. కాగా బిల్డర్ విజయలక్ష్మి తాను చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని పక్కనే ఉన్న మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హైడ్రా అధికారులు సైతం పర్యటించారు. మొదట్లో ఏడు విల్లాలు మాత్రమే బఫర్ జోన్లోకి వస్తున్నట్లు నిర్ధారించి మార్కింగ్ చేశారు. మొత్తం 13 విల్లాలను కూల్చివేసిన అధికారులు, మరో 14 విల్లాల్లో జనం నివాసముంటుండటంతో వారికి 15 రోజుల గడువు ఇచ్చారు.
సరుకులు కూడా సర్దుకునే టైం ఇవ్వలేదు
నాకు సున్నం చెరువు వద్ద శానిటరీ గోడౌన్ ఉంది. అందులో దాదాపు 4 కోట్ల విలువైన శానిటరీ సామాన్లు ఉన్నాయి. హైడ్రా అధికారులు ఉదయం 5 గంటల సమయంలో వచ్చి సామాన్లను తీసి బయటపెట్టండి అని చెప్పారు. చెప్పిన కొంతసేపటికే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ సర్కార్ సామాన్యులపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నది. హైడ్రా అధికారులకు సామాన్యులు మాత్రమే కనిపిస్తున్నారా.. గొప్పవారు కనిపించడం లేదా.. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చివేతలు చేస్తే మా పరిస్థితి ఏం కావాలి. మా బతుకులు రోడ్డుపైన పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనికరించడం లేదు.
– కిశోర్, వ్యాపారి
మా ల్యాండ్ ఎఫ్టీఎల్లో లేదు
మా ల్యాండ్ ఎఫ్టీఎల్లో లేనప్పటికీ కూల్చివేశారు. కోర్టులో కేసు నడుస్తున్నది. నవంబర్ లోపల రీ సర్వే చేయమని కోర్టు ఆదేశించింది. అటువంటిది కోర్టులో ఉన్న వాటిని హైడ్రా ఎలా కూల్చివేస్తుంది. కోర్టులో విచారణ ముగియకముందే చర్యలు ఎలా తీసుకుంటారు..? కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై అరాచకాలు చేస్తున్నది. విర్రవీగిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పేదలపై చేస్తున్న అరాచకాలను ఇప్పటికైనా ఆపు. లేదంటే తీవ్రంగా నష్టపోతావు.
– నాగేశ్వర్, స్థానికుడు