సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సున్నంచెరువు వద్ద ఎఫ్టీఎల్ ఆక్రమణలంటూ సోమవారం తెల్లవారుజామున పేదల ఇళ్లను కూల్చేసిన హైడ్రా చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమకు కోర్టు ఆర్డరున్నదని నిరుపేదలు నెత్తినోరు మొత్తుకున్నా వినకుండా పేదల ఇళ్లు కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్య అత్యంత దుర్మార్గమని మంగళవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకో న్యాయం పెద్దలకో న్యాయమా అని మండిపడ్డారు. మరోవైపు హైదరాబాద్‌లో పేదలు, మధ్యతరగతి ప్రజలపై హైడ్రా తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ అకౌంట్ వేదికగా మండిపడ్డారు. ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ బుల్డోజర్ రాజకీయాలను ఖండిస్తూ ‘మొహబ్బత్‌కీ దుకాన్’ గురించి మాట్లాడుతుంటే ఆయన సొంత పార్టీ నేత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం పోలీసు బలగాలతో పేదల జీవితాలను నాశనం చేస్తూ రాహుల్ సిద్ధాంతానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇదిలా ఉంటే సున్నంచెరువు వద్ద నివాసముండే సియేట్ కాలనీవాసులు మంగళవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌ను కలిసి తమ డాక్యుమెంట్లను చూపించారు. సున్నంచెరువు ఎఫ్టీఎల్ విషయంలో కమిషనర్‌తో తమ దగ్గరున్న వివరాలు తెలపడంతో పాటు హైడ్రా వల్ల తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
సున్నంచెరువు ఎఫ్టీఎల్ ఆక్రమణల పేరుతో సోమవారం జరిగిన హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చి నువ్వు మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడ్డికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు.. కానీ, మా ఇండ్ల్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని నిరుపేదలు నెత్తినోరు కొట్టుకున్నా పట్టించుకోరా? అని కేటీఆర్ నిలదీశారు. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పార్టీ నేతలకో న్యాయం పేదలకు ఓ న్యాయమా అని మండిపడ్డారు.
హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టలబేగంపేటలో ఇళ్లను కూల్చేసిందని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు తమ వస్తువులను తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరినా వారి కేకలు వినపించుకోకుండా బుల్డోజర్లను ముందుకు నడిపారన్నారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, ఖర్గే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణకు యూపీ తరహాలో బుల్డోజర్‌రాజ్ తీసుకురావద్దని హరీశ్ రావు సూచించారు.