హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్‌లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. సోమవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు, జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన గుడిసెలను కూల్చివేశారు. అదేవిధంగా చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు.
సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని ఇటీవల హైడ్రా సూచించిన విషయం తెలిసిందే. చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకరస్థాయిలో ఉన్నాయనే అంశంపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న వాటర్ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేసింది సీసం, కాడ్మియం, నికెల్ వంటి లోహాల మోతాదు ఈ నీటిలో అధికంగా ఉన్నాయని, ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పీసీబీ హెచ్చరించినట్లుగా హైడ్రా తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది.
కాగా, సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు గత మంటళవారం హైడ్రాకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. తమ నివాసాలను ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంతోపాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా అధికారులు తమ గుడిసెలను తొలగించడంతో వారు నిరాశ్రయులు అయ్యారు. నిలువ నీడలేకుండా చేయడంతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ రోధిస్తున్నారు. కాగా, రూ.10 కోట్ల వ్యయంతో సున్నం చెరువులో హైడ్రా అభివృద్ధి పనులను చేపట్టింది.