శంషాబాద్ రూరల్, జనవరి 9 : చెరువులు(Ponds ), కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శంషాబాద్ మున్సిపాలిటీలోని గొల్లవానికుంట, ధర్మోజికుంటలు కబ్జాకు గురైనట్లు ఇటీవల మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 104లో గొల్లవాని కుంట 22 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఉంది.
ధర్మోజికుంట సర్వే నంబర్ 73లో 10 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపారు. కానీ ఇక్కడ గొల్లవాని కుంటను పూర్తిగా ధ్వంసం చేసి భారీ భవనాలు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో పాటు ధర్మోజికుంట ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమంచి నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని గుర్తించిన్నట్లు ఆయన తెలిపారు. వాటిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్మోజికుంటను ఆక్రమించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు.
ధర్మోజికుంటను పూడ్చివేస్తూ నిర్మాణం చేస్తున్నది ఎవరని కమిషనర్ అధికారులను ప్రశ్నించగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువులుగా వివరించారు. దీంతో రెండు రోజులలో ప్రహరీ నిర్మాణం తొలగించి చెరువులో వేసిన మట్టిని ఎత్తివేయించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అసలత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.