సిటీ బ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): సల్కం చెరువు ఒవైసీ ఆక్రమణపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం ఆయన బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సల్కం చెరువు విషయంలో సర్వే చేయాలని కోర్టు ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించిందన్నారు.
ఆ శాఖల సర్వే ఆధారంగా వచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బతుకమ్మ కుంట వివాదంలో ఎడ్ల సుధాకర్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. బతుకమ్మ కుంట వ్యవసాయ భూమి కాదని.. 1970 నుంచి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగానే ఉన్నదని అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, నాసా శాటిలైట్ చిత్రాలు కూడా అక్కడ చెరువు ఉన్నట్లు తేల్చాయన్నారు. తమ దగ్గరున్న ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. దానికి అనుగుణంగా కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. హైడ్రా ఇప్పటికే నిర్మించిన ఇండ్ల జోలికి పోదని.. ఎవరైనా కబ్జాకు యత్నిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి దాకా మూడు చెరువులు సుందరీకరించామని, మరో మూడు చెరువుల సుందరీకరణ పనులు సాగుతున్నట్లు వివరించారు.
నగరంలోని అన్ని చెరువులను దశలవారీగా సుందరీకరిస్తామని, అందుకోసం సీఎస్ఆర్ ఫండ్స్, ఎన్జీవోల సహకారం తీసుకుంటామన్నారు. సున్నంచెరువు సహా చెరువుల ఒడ్డున ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారిని గుర్తించి పరిహరం అందిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు హైడ్రా 2090 ఎకరాల భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడిందని, ఆ భూముల విలువ దాదాపు రూ.80 వేల కోట్లుంటుందని చెప్పారు. కాపాడిన భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రజావాణి ద్వారా ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎన్ని పరిష్కరించారని అడిగిన ప్రశ్నకు త్వరలో వివరాలు ప్రెస్‌నోట్ ద్వారా వెల్లడిస్తామని రంగనాథ్ దాటవేశారు. ఇప్పటి వరకు కబ్జాకోరులకు సహకరించిన ఎంత మంది అధికారులపై చర్యలు తీసుకున్నారంటే.. తాము ఆయా శాఖలకు ఫిర్యాదు చేశామని… అందుకు అనుగుణంగా చర్యలుంటామని చెప్పారు.