సిటీ బ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అల్వాల్ మండలం తిరుమలగిరిలోని లోతుకుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి జనరల్ ల్యాండ్ రికారడ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా నమోదవ్వగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తమదని పేర్కొంటున్నారు. దీంతో వందకు పైగా ఏకరాలున్న భూమిలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వకూడదని అధికారులకు సూచించారు.
అనంతరం గండిమైసమ్మ మండలం దుండిగల్ లోని బుబ్బఖాన్ చెరువు దిగువున ఉన్న లింగం చెరువు కాలువ పరిసరాలను పరిశీలించారు. బుబ్బఖాన్ చెరువు అలుగు, తూముల నుంచి వరద నీరు వెళ్లకుండా నాలాను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టడంతో వరద ముంచెత్తుతోందని స్థానికులు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. నాలా సమస్యను పరిష్క రించాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో కలసి కట్టుగా నిర్ణయానికి రావాలని అక్కడి నివాసితులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కమిషనర్ సూచించారు. తర్వాత హఫీజ్ దగ్గర ప్రభుత్వ భూమి కాబ్జాను పరిశీలించారు. టీడీఆర్ కింద లబ్ధిపొంది.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.