సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర కాలంగా నిర్వాసితులైన మాదాపూర్ సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు బాధితుల పునరావాసంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడంతో ఏడాదిన్నరగా దిక్కుతోచని స్థితిలో బతుకీడుస్తున్నారు. నగరంలో చెత్త సేకరణ చేస్తూ జీవనం సాగిస్తుండటంతో ఇండ్లను కోల్పోతే..ఎక్కడా అద్దెకు ఇవ్వని పరిస్థితుల్లో తీవ్ర అవస్థలు పడ్డారు.
ప్రభుత్వం ముందస్తుగా పునరావాసం కల్పించకుండా రోడ్డు పాలు చేసి… ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటున్నది. తాజాగా 2024 జులై 19కి ముందు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉన్నవారి వివరాలు సేకరించి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం బాధితులతో సమావేశమయ్యారు. సున్నంచెరువు, రామంతపూర్ చెరువు పరీవాహకంలో నివసిస్తున్న ప్రజల ఇండ్లను గతంలో హైడ్రా కూల్చివేసింది. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. హైడ్రా అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చేశారు. బాధితులకు ముందస్తుగా ఎలాంటి హామీ ఇవ్వకుండా ముందుగా ఇండ్లను కూల్చేశారు. ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. చెత్త సేకరణ చేసుకుంటూ జీవిస్తున్న తమకు అద్దెకు ఇండ్లు దొరకడం లేదని.. వీలైనంత తొందరగా పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
హైడ్రా బుల్డోజర్లు తమ బతుకులను ఛిద్రం చేయడంతో ఏడాదిన్నరగా ఎక్కడికి పోవాలో దిక్కుతోచని స్థితిలో సున్నచెరువు, రామంతాపూర్ చెరువు బాధితులు జీవనం సాగిస్తున్నారు. కనీసం వస్తువులను తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇండ్లను కూల్చేశారు. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నారు. రెక్కడితే కానీ డొక్కాడని జీవితాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారాన్ని కూల్చేసి.. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా డబుల్ బెడ్రూం ఇండ్లయినా సకాలంలో ఇవ్వాలని వేడుకుంటున్నారు.