సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లక్డీకపూల్ పరిసర ప్రాంతాలను బుధవారం హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్వీ కర్ణన్‌లు సంయుక్తంగా పరిశీలించారు. మాసబ్‌ట్యాంక్ నుంచి లక్డీకపూల్ వైపు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఇరువురు కమిషనర్లు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న సైపులైన్లను వేశామని, వాటిని మహావీర్ అసుపత్రి పరిసరాలతోపాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు వరదనీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాలన్నారు. మహావీర్ ఆసుపత్రి ముందు నుంచి మెహిదీ ఫంక్షన్‌హాల్ వరకు రోడ్డుకు పక్కగా ఉన్న పైపులైన్లలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే ..సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని కమిషనర్లు సూచించా రు. ట్రాఫిక్ పోలీసులు కూడా పైపులైన్ల అనుసంధాన పనులు త్వరగా జరిగేలా సహకరించాలని సూచించారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.