HYDRAA | సిటీబ్యూరో/మణికొండ, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నులు కడుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ లోపు హైడ్రా వచ్చింది.. నోటీసులిచ్చింది. సమాధానం ఎందుకివ్వలేదంటూ.. తెల్లవారుజామునే వచ్చి 14 షట్టర్లను కూల్చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు షాపులన్నీ శిథిలాలుగా మిగిలాయి. తమ కళ్లముందే వ్యాపారాలతో కళకళలాడుతున్న షట్టర్లన్నింటినీ హఠాత్తుగా కూల్చివేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తీరుపై దుమ్మెత్తి పోశారు.
మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌లో ఎటువంటి అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న కారణంతో 14 షట్టర్లను అధికారులు గురువారం తొలగించారు. రంగంలోకి దిగిన హైడ్రాఅధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం.. నివాసిత భవనాల పేరుతో అనుమతులు పొంది వ్యాపార కేంద్రాలుగా వినియోగిస్తున్న నిర్మాణాలను కూల్చివేయాలని స్థానిక మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. గురువారం ఉదయం అల్కాపూర్‌కు చేరుకున్న హైడ్రా, మున్సిపల్, పోలీసులు, సిబ్బందిని అపార్ట్మెంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. అనంతరం అధికారులు రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్, హైడ్రా అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ రోడ్డు నం.25లో అనుహర్ హోం నిర్మాణరంగ సంస్థ ‘మార్నింగ్ రాగా’ పేరుతో 2016 హెచ్ఎండీఏ నుంచి గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు పొంది, నిర్మాణాలను 2018లో పూర్తిచేసి, అలాగే ఎన్ఓసీ పొందారు. తర్వాత 2023లో వ్యాపార కేంద్రాలుగా గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్లను ఏర్పాటు చేసిన సంస్థ విడివిడిగా వివిధ వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు కేటాయింపులు చేసింది. ఇందుకు గాను స్థానిక మున్సిపాలిటీకి కమర్షియల్ పన్నులు సైతం చెల్లిస్తున్నది.
అయితే పై అంతస్తుల్లోని నివాసితులు వ్యాపార కేంద్రాలతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వ్యాపార కేంద్రాలను తక్షణమే మూసివేయాలని మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులను ఆశ్రయించారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఈనెల 7న అపార్ట్మెంట్లోని వాణిజ్య సముదాయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటి ని తొలగించాలని అధికారులకు సూచించారు. అంతకుముందే మున్సిపల్ అధికారులు నవంబర్ 27న ఆ అపార్ట్‌మెంట్స్‌కు నోటీసులు జారీ చేసి ఏడురోజుల్లో తొలగించాలని ఆదేశించారు. ఆ నోటీసులకు అపార్ట్మెంట్ యజమాని నుంచి స్పందన రాకపోవడంతో గురువారం ఉదయం అక్కడికి చేరుకున్న సిబ్బంది 14 షట్టర్లను తొలగించారు.
కూల్చివేతల విషయం తెలుసుకున్న వ్యాపార నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు తాము వ్యాపారం చేసుకుంటూ కమర్షియల్ ట్యాక్సులు చెల్లిస్తున్నామని.. కొంతమంది వ్యక్తుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారని మండిపడ్డారు. షట్టర్లను కూల్చివేయడంపై స్థానికులు దుమ్మెత్తి పోశారు. ఇలాంటి నిర్మాణాలు మణికొండలో 60 వేల వరకు ఉంటాయని ఇవన్నీ రంగనాథ్ కూల్చివేయించాలంటూ.. హైడ్రా అలా చేయగలదా? అని ప్రశ్నించారు.
అనుమతులు మీరే ఇస్తరు..కూల్చివేతలు మీరే చేస్తరు..అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. హైడ్రాకు ఏం సంబంధం. నిజాయితీగా చేయాలనుకుంటే మణికొండ నుంచి మొదలు పెట్టి చార్మినార్ దాకా కూల్చివేతలు చేపట్టాలి. ఎవరో ఫిర్యాదు చేస్తే నిజాయితీ పరుల్లా కూల్చివేతలు చేస్తున్నారు బాగుంది. ఒకటి రెండు కాదు అంతటా..రెసిడెన్షియల్ అనుమతులు పొంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో వ్యాపార కేంద్రాలను నడుపుకుంటూ వేలాదిమంది జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ కూల్చివేస్తారా? దమ్ముందా? ఫిర్యాదు దారుడే పెద్ద బ్లాక్‌మెయిలర్. అలాంటి వాళ్లకే హైడ్రా స్పందిస్తుందా? ఇక్కడ నాలుగు షట్టర్లు వేసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారినే టార్గెట్ చేయడం దారుణం. నిజంగా హైడ్రాకు దమ్ముంటే అంతటా కూల్చివేతలు చేట్టాలి.
-వి.బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ నార్సింగి డైరెక్టర్
రెండున్నరేండ్ల కింద ఇక్కడ కూరగాయల వ్యాపారం పెట్టాలని అపార్టుమెంటు వాసులే పదేపదే అడిగితే మేము వ్యాపారం ప్రారంభించాం. నా భర్త చనిపోయి మూడు మాసాలయ్యింది. ఆ బాధలో కొట్టుమిట్టాడుతున్న నేను ఒంటరి మహిళగా పదిమందికి ఉపాధి కల్పిస్తూ తాజా కూరగాయల దుకాణం నడుపుతున్న. ఇప్పుడు ఎవ్వరో ఫిర్యాదు చేశారంటూ అధికారులు వచ్చి కూల్చేశారు. కనీస సమాచారం లేకుండా కూల్చివేతలు చేయడంతో నేను నా కుటుంబం, నాపై ఆధారపడి పనిచేస్తున్న వారంతా రోడ్డుపాలయ్యారు. దీనికి ఎవరూ బాధ్యులు? ఇంత దారుణంగా ఎక్కడా లేదు. నా కుటుంబం ఉసురు తగులుతది.
– నీలిమా, బండి కూరగాయల వ్యాపారి
కమర్షియల్ కాదంటూ కూల్చివేస్తున్నారు..కమర్షియల్ ట్యాక్సు ఎందుకు తీసుకుంటున్నారు. ఒక్క ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేలల్లో ఉన్న ఇలాంటి భవనాలపై కూడా ఇదేవిధంగా చర్యలు తీసుకోవాలి. నిన్ననే జూలై 2024 తర్వాత చేపట్టిన నిర్మాణాల్లో ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు 2016లో నిర్మించిన భవనంపై కూల్చివేతలు చేయడమేమిటీ. ఏ హక్కుతో కూల్చారు? ఓ మహిళ కూరగాయల దుకాణం నడుపుకుంటుంటే..స్వయంశక్తితో బతుకుతుంటే మహిళలను ఏడిపించే ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇదీ. పేదవారిపై హైడ్రా పెత్తనం ఏమిటీ. హైదరాబాద్‌లోని లక్షలాది దుకాణాలు ఇదేవిధంగా ఉన్నాయి కూల్చుతారా? ఇదేనా సమ న్యాయమంటే..ఇన్నీ నిర్మాణాలున్నప్పుడు పాలసీ ఏర్పాటు చేసి సూచనలు చేయాలే తప్ప డైరెక్టుగా కూల్చివేస్తారా? ప్రజాసంక్షేమం కన్నా విధ్వంసానికే హైడ్రా పనిచేస్తుంది. కేవలం కొంతమంది వ్యక్తులకే కొమ్ముకాస్తూ.. దశ, దిశ లేకుండా హైడ్రాకూల్చివేతలు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
-డా.జయంతి, షట్టర్ యజమాని
అల్కాపూర్‌లో మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌లో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్‌గా వినియోగిస్తున్న 14 షట్టర్లను స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది హైడ్రా సమక్షంలో తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో మార్నింగ్ రాగాలో నివాసముంటున్న 16 ప్లాట్ల యజమానుల నుంచి హైడ్రాకు ఫిర్యాదు వచ్చిందని.. మూడేళ్ల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా స్థానికులు ఫిర్యాదు చేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఇరు వర్గాలను పిలిచి హైడ్రా కార్యాలయంలో సమావేశపరిచి పత్రాలను పరిశీలించామన్నారు. అపార్ట్మెంట్ యజమానికి నోటీసులిచ్చినా పట్టించుకోలేదని, షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. డెమాలిషన్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ మినహా ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 సెక్షన్17 బి(2)ప్రకారం హైడ్రాకు సమకూరిన హక్కుల మేరకు కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ అపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను రంగనాథ్ మీడియాకు విడుదల చేశారు.