HYDRAA | సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో నాలాలపై హైడ్రా దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ లోపల వరకు నాలాల విస్తరణ, సమాంతర డ్రైయిన్ నిర్మాణం అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించారు. నాలాల ఆక్రమణల తొలగింపు వల్ల స్థానికులతో వివాదాలు, పునరావాసం వంటి ఇతర అంశాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరమున్న నేపథ్యంలో నాలాల విషయంలో హైడ్రా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నది.
నాలాలకు సమాంతరంగా డ్రైయిన్ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ పథకం కింద చేపట్టింది. ఇటీవల రాంనగర్లో నాలాలపై ఆక్రమణల తొలగింపు తర్వాత ఎదురైన అనుభవాల కారణంగా ఆక్రమణల తొలగింపు పక్కన పెట్టి గత ప్రభుత్వ ప్రణాళికనే అమలు చేస్తే బాగుంటుందని హైడ్రా భావిస్తున్నది. మూడురోజుల కిందట హైడ్రా కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల పునరుద్ధరణతో పాటు నాలాలపై కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో నాలాలపై ఆక్రమణల తొలగింపు, పునరావాసం, పునరుద్ధరణ వంటి వాటికోసం లక్షకోట్లు అవసరమవుతాయంటూ రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు.
దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో ఎస్ఎన్డీపీ పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తావించారు. ఆక్రమణలు, తొలగింపులు వంటి అంశాలు కాకుండా నాలాలకు సమాంతరంగా డ్రైయిన్ నిర్మాణాలు చేపడితే వరద ముప్పు తగ్గే అవకాశముంటుందని, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని, నాలాల ఆక్రమణల తొలగింపు కష్టసాధ్యమైన కారణంగా ఎస్ఎన్డీపీ విషయంలోనే ఇంజినీర్ల సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
నాలాల పునరుద్దరణలో భాగంగా అవసరమైన చోట వాటిని తొలగించే పనిని హైడ్రాకు అప్పగించారు. రాంనగర్లో జరిగిన ఆక్రమణల తొలగింపు తర్వాత నాలాల విషయంలో స్థానికులు ప్రధానంగా సొంత పార్టీ నేతల నుంచే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిలు వచ్చాయని దీంతో హైడ్రా నాలాలపై ఆక్రమణల తొలగింపులో వెనక్కు తగ్గింది. మరి ముంపు సమస్యను పరిష్కరించడం ఎలా అన్నదానిపై ప్రభుత్వం, పురపాలక శాఖ, హైడ్రా బృందంతో సమీక్ష నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దన్న ఆలోచనతో ప్రస్తుతం ఉన్న నాలాలకు సమాంతర డ్రెయిన్ల నిర్మించడానికి ఎస్ఎన్డీపీ పథకం కింద ప్రణాళికలు రూపొందించారు. కొన్నిచోట్ల పనులు కూడా జరిగాయి. మొదటిదశలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 737 కోట్ల నిధులతో 35 పనులు చేపడితే 55 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గ్రేటర్ వెలుపల 248 కోట్లతో 21 పనులు చేపడితే 40 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనుల కొనసాగింపు లేకపోగా.. హైడ్రా పేరుతో కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి బీఆర్ఎస్ ప్రణాళికలనే అమలు చేసి పనులు చేయడానికి నిపుణుల సలహాతో ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో పురపాలకశాఖ హైడ్రా సహకారం తీసుకుంటున్నారని, ఈ క్రమంలో తాము నిపుణుల సలహాలు తీసుకుని నివేదిక తయారు చేస్తున్నామని హైడ్రా అధికారులు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 370 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు ప్రవహిస్తున్నాయి.1250 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువలున్నాయి. వరద, మురుగు నీటిని మోసుకెళ్తూ మూసీలో కలుస్తాయి. వీటి ప్రవాహవ్యవస్థ సామర్థ్యం కేవలం 2సెంమీలు మాత్రమే. కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో వర్షపాతం నమోదవడంతో రహదారులన్నీ జలమయమవుతున్నాయి.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కారణంగా తెలుస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ చేపట్టిన సర్వేలో నాలాలపై 12వేలకు పైగా ఆక్రమణలున్నట్లు గుర్తించారు. ఇందులో 35 శాతం మేర నివాసేతర నిర్మాణాలే ఉన్నట్లు గుర్తించారు. వాటి వల్ల కొన్నిచోట్ల 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 10 అడుగుల వెడల్పుకు చేరుకున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
నాలాల సమగ్రాభివృద్ధికి పదివేల కోట్లు అవసరమని అధికారులు గతంలో ప్రణాళికలు రూపొందించారు. నిధుల కొరత, ఆక్రమణల తొలగింపు, పునరావాసం తదితర ఇబ్బందుల నేపథ్యంలో నాలాల పునరుద్ధరణ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ నాలాల వ్యవహారం తెరపైకి వచ్చింది. చెరువుల పునరుద్ధరణతో పాటు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రేటర్‌తో పాటు హైడ్రా పరిధిలో ఉన్న నాలాల అంశంపై రిటైర్డ్ ఇంజినీర్లతో కమిషనర్ రంగనాథ్ అంశాల వారీగా చర్చించారు. చాలా చోట్ల ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని వీటిని తొలగించడం కంటే ఎస్ఎన్డీపీ కింద పనులు చేస్తే బాగుంటుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని రంగనాథ్ చెప్పారు.
ఈ నేపథ్యంలో హైడ్రా ఇటీవల వర్షాకాలంలో నాలాలపై సర్వే కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల సహకారాన్ని తీసుకున్నది. రాంనగర్ మణెమ్మకాలనీలో నాలాపై నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. అదే తరహాలో మిగిలిన నాలాలపై ఆక్రమణలు కూడా తొలగించాలనుకున్నా.. అది ఆచరణలో చాలా కష్టమని తేలింది. నాలాల పునరుద్ధరణకోసం జేఎన్టీయూ, బిట్స్పిలానీలోని ఇంజినీరింగ్ విద్యార్థుల సహకారంతో హైడ్రా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆక్రమణలకు సంబంధించిన అంశాలతో పాటు ప్రధానంగా ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్‌లో సమస్య ఉందో కూడా నివేదిక రూపొందించారు.
అయితే గతంలో జీహెచ్ఎంసీ చేసిన సర్వేతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థుల సర్వే రెండింటిని కూర్పు చేసి సమస్య పరిష్కారం దిశగా అడుగులేసే యోచనలో హైడ్రా ఉంది. ఇప్పటికే ఈ నివేదికలు ఉన్న కారణంగా హైడ్రా కార్యాలయంలో రిటైర్డ్ ఇంజినీర్లతో జరిగిన సమావేశంలో నాలాలపై చర్చించారు. గ్రేటర్ లోపల నాలాల పరిస్థితిపై అధ్యయనం చేసి నాలాల నిర్మాణంపై అవగాహన ఉన్న కిషన్ వంటి ఇంజినీర్లతో ఒక కమిటీ వేసి వారి సలహాలతో ముందుకు పోవడానికి నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సర్వే రిపోర్ట్‌తో పాటు హైడ్రా సమావేశ నివేదికను అందించి తుది కార్యాచరణ రూపొందిస్తారని తెలిసింది.