పీడీ యాక్ట్ విధించినా మారని స్నాచర్లు
ముగ్గురు నిందితులు అరెస్టు
వీడిన 21 స్నాచింగ్లు, చోరీల మిస్టరీ
రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం
సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ) : తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. దాసరి మురళి అలియాస్ బాలు అలియాస్ కృష్ణ, కూతాటి పరమేశ్, తోట సారయ్యలు మహబూబాబాద్ జిల్లా నెల్లికూడురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వారు. దాసరి మురళి, కూతాటి పరమేశ్లు 19, 22 ఏండ్ల వయస్సు నుంచే నేరాల బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఉన్న చోట చోరీలకు పాల్పడేవారు.
ఈ క్రమంలో రాచకొండ పోలీసులు రెండు సార్లు మురళిపై, పరమేశ్పై ఒక సారి పీడీ యాక్ట్ విధించారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఇటీవల జైలు నుంచి విడుదలై తాజాగా 21చోరీలు చేశారు. 15 రోజుల కిందట దాసరి మురళి తండ్రి నర్సయ్యను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో దాసరి మురళి విషయం రావడంతో అతడిని భువనగిరి సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విచారణలో పాత నేరస్థులైన దాసరి మురళి, పరమేశ్తో తోట సారయ్య తోడయ్యాడని తెలుసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 44.5 తులాల బంగారం, 1.2 కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ముఠాను పట్టుకున్న భువనగిరి సీసీఎస్ బృందాన్ని సీపీ అభినందించి వారికి రివార్డులను అందజేశారు.