Hyderabad Metro | సిటీబ్యూరో: రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టనున్న మియాపూర్-పటాన్చెరు మెట్రో వివరాలను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో అథారిటీ వెల్లడించింది.మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించే ఈ మార్గంలో రాబోయే మెట్రో స్టేషన్ల వివరాలను అధికారికంగా మెట్రో సంస్థ వెల్లడించింది. 13 కిలోమీటర్ల అందుబాటులోకి వచ్చే మెట్రో మార్గంలో 10 స్టేషన్లతో డెవలప్ చేయనున్నారు.
మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు ఎలివేటెడ్ కారిడార్లోనే మెట్రో రాకపోకలు నిర్వహించనున్నారు. ఫేస్-2లో నిర్మించనున్న కారిడార్ – 7లో ఉన్న మియాపూర్-పటాన్చెరు మెట్రో నిర్మాణానికి రూ.4107 కోట్లు ఖర్చు చేయనున్నారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుని మియాపూర్ క్రాస్ రోడ్డు, అల్విన్ క్రాస్ రోడ్డు, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీ పురం, ఇక్రిసాట్, పటాన్చెరు స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ మార్గంలో 2028 నాటికి కనీసం 1.65లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు మెట్రో సంస్థ అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లాలను మెట్రో అనుసంధానం చేయనున్నారు.
పారిశ్రామిక కారిడార్‌గా గుర్తింపు పొందిన ఈ మార్గంలో ప్రస్తుతం ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలే ప్రధాన రవాణా సదుపాయాలు పొందుతుండగా.. అందుబాటులోకి వచ్చే మెట్రోతో మియాపూర్ నుంచి పటాన్చెరు మధ్య ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరించడంలో మెట్రో కీలక పాత్ర పోషించనుంది.