Hyderabad Metro | సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సుస్థిర ప్రభుత్వం… సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొంతం చేసుకుంది. అలాంటి మహానగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు స్థాయికి తీసుకువెళ్తున్నది.
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల కెక్కింది. మహానగరంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టులను కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా మార్చివేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 415 కి.మీ మేర నగరం నలుమూలలా మెట్రో మార్గాలను దశల వారీగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు చేపడితే వాటిని పూర్తిగా రద్దు చేసి.. కొత్త మార్గాలను 70 కి.మీ పరిమితం చేసి.. రేవంత్ సర్కారు ప్రతిపాదించింది.
దీంతో 9 నెలలుగా కొత్తగా ఒక్క మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడమే కాకుండా నిర్మాణంలో ఒక్క కి.మీ మెట్రో మార్గం కూడా లేదు. దీంతో దేశంలో హైదరాబాద్ మెట్రో రైలు స్థానం 5వ స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 70 కి.మీ మేర ప్రతిపాదించిన 7 మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) సిద్ధం చేయలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఒకవైపు హైదరాబాద్ కంటే వెనకబడి ఉన్న చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో 100కు పైగా కి.మీ మేర మెట్రో మార్గాలు నిర్మాణంలో ఉంటే, హైదరాబాద్లో మాత్రం నిర్వహణలో ఉన్నది కేవలం 69 కి.మీలు ఉండగా, నిర్మాణంలో ఒక్క కి.మీ మెట్రో మార్గం లేదు. ఇక ప్రతిపాదన దశలో ఉన్న 70 కి.మీ మార్గానికి ఎప్పుడు డీపీఆర్ వస్తుంది? దానికి కేంద్రం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో కలిపి మెట్రో మార్గం సుమారు 902.39 కి.మీ మేర ఉన్నాయి. మెట్రో రైళ్లకు దేశ వ్యాప్తంగా ఆదరణ ఉండటంతో కొత్త మార్గాలను ప్రతిపాదిస్తూ , దశల వారీగా నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలోనే 649.56 కి.మీ ఉండగా, కొత్తగా ఆమోదం పొందిన మార్గాలు 261.03 కి.మీ, ప్రతిపాదనల దశలో మరో 1065 .83 కి.మీ మేర మార్గాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ మెట్రో రైలు మార్గం మాత్రం 69 కి.మీకే పరిమితమవ్వడంపై నగర వాసులు నిరుత్సాహంతో ఉన్నారు. మెట్రో మార్గాల నిర్మాణంలో ఢిల్లీ మెట్రోతో పోటీపడాల్సిన హైదరాబాద్ 5వ స్థానం నుంచి అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.