సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సమాలోచనలు చేస్తున్నది. నిత్యం ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నా బోగీల పెంపుపై దృష్టి పెట్టని మెట్రో సంస్థ… రైళ్ల రాకపోకలను సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. ప్రస్తుతం 3 నిమిషాలకొకసారి మెట్రో రైలు అందుబాటులో ఉండగా… ఈ సమయాన్ని ఒక్క నిమిషం తగ్గించి ప్రతి రెండు నిమిషాలకొక సర్వీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండగా.. సాధ్యాసాధ్యాలపై అంచనా తర్వాత అమలుచేసే అవకాశం ఉంది.
పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో మెట్రో ప్రయాణంలో ఇబ్బందులు తప్ప డంలేదు. సౌకర్యవంతమైన ప్రయాణం లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో కిక్కిరిసిపోయే మెట్రో బోగీల్లో ప్రయాణమంటే జంకుతున్నారు. ఈ క్రమంలో కొత్త బోగీలను ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు మెట్రో రైళ్ల రాకపోకలను పరిశీలిస్తున్నది.
ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మెట్రో రైలు రావడం ద్వారా ప్ర యాణికులు ఎదురుచూసే పరిస్థితి ఉండదని, దీంతో రద్దీకి తాత్కాలికంగా పరిష్కా రం దొరుకుతుందని అంచనా వేస్తున్నది. ప్రస్తుతం మూడు బోగీల్లో 900 మంది జర్నీ చేసే వీలు ఉండగా… ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. ఈ సమయాన్ని తగ్గించగలిగితే ఒక బోగీ నిండిపోయినా… మరో రెండు నిమిషాల్లో ఖాళీ బోగీలతో సర్వీసు అందుబాటులో ఉంటుందని, దీంతో ప్రయాణికులకు పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరగడంతో నగరంలో మెట్రో సర్వీసుల సేవలను పొడిగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులను తొలగించడం కోసం గతంలోనే అదనపు బోగీల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. కానీ ఈ విషయం ఆచరణకు ఇప్పటికీ సాధ్యం కాలేదు. నిధుల కొరత, బోగీల తయారీకి ఏడాది సమయం కారణంగా మెట్రో రైళ్ల రద్దీకి పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలోనే ఫ్రీక్వెన్సీ తగ్గించడం వలన మెట్రోలో ఎదురవుతున్న రద్దీ తీవ్రత తీరుతుందని చెబుతున్నారు.