Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో ఎర్రమంజిల్ దగ్గర మెట్రో నిలిచిపోయింది. ఒక్కసారిగా మెట్రో ట్రైన్ ఆగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఎమర్జెన్సీ డోర్ తీసుకుని ప్రయాణికులు బయటకు వచ్చేశారు.
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ప్రయాణికుల తాకిడి దృష్ట్యా మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు. ఈ క్రమంలోనే ఓ రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. మరో పక్క ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ మెషిన్లు సాంకేతిక సమస్యతో మొరాయించడంతో అక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.