Hyderabad | అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌పై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకు..? ప్రతి ఒక్క హైదరాబాదీని తొలుస్తున్న ప్రశ్న ఇది. మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు.. మెట్రో రెండో దశ సాధ్యం కాదంటూ.. మళ్లీ తన కుటిల నీతిని బయటపెట్టుకున్నది. దేశంలోని అనేక నగరాల్లోని మెట్రో బోగీలు సరైన ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. కనీసం రోజుకు 50వేల మంది కూడా ఎక్కని పరిస్థితి. ఇలా అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా.. కేంద్రం ఆయా నగరాలకు మరిన్ని నిధులిచ్చి.. మెట్రో విస్తరణకు సహకరిస్తున్నది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అనతికాలంలోనే నగరవాసుల ఆదరణను చూరగొన్నది. సిటీలోని అనేక ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరమున్నదని భారీ ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశను 31 కిలోమీటర్ల మేర చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. కేంద్రానికి పంపిస్తే.. రాజకీయ దురుద్దేశంతో తిరస్కరించి.. ఎప్పటిలాగే తెలంగాణపై పక్షపాతాన్ని చూపింది.
సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నానాటికి పెరిగిపోతున్న పట్టణీకరణతో రవాణా వ్యవస్థ అనేది సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో దేశంలోని అనేక నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 18 నగరాల్లో మెట్రో ఉండగా.. ఇందులో 2014 తర్వాతే 13 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు వచ్చాయి. అందుబాటులోకి వచ్చిన, నిర్మాణ దశలో ఉన్న మెట్రోలు సుమారు 1392 కిలోమీటర్లు ఉండగా… కేంద్రం వద్ద ప్రతిపాదనల దశలో మరో 593 కిలోమీటర్లు ఉన్నాయి. అయితే ప్రజావసరాలు, ఆయా నగరాలు విస్తరిస్తున్న తీరు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకొని కేంద్రం మెట్రో ప్రాజెక్టులకు సహకారాన్ని అందించాలి. సమైక్య స్ఫూర్తితో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి ఆశించేది ఇదే. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రాజకీయాలే పరమావధిగా ప్రజాధనాన్ని వెచ్చిస్తుంది. 2014 తర్వాత చేపట్టిన మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న మంజూరీలే ఇందుకు నిదర్శనం.
2014కు ముందే చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అనతికాలంలోనే నగరవాసుల ఆదరణను పెంచుకుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న 62 కిలోమీటర్ల మెట్రో అంచెలవారీగా 2017 నుంచి అందుబాటులోకి వచ్చింది. పైగా 2020, 2021.. రెండేళ్లపాటు కరోనా వెంటాడింది. అంటే దాదాపు పూర్తిస్థాయిలో మూడు, మూడున్నర సంవత్సరాలు! ఇంత తక్కువ కాలంలోనే హైదరాబాద్ మెట్రో ఏకంగా ఆరున్నర లక్షల మంది ప్రయాణికుల ఆదరణకు నోచుకుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. (హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లెక్కల ప్రకారం.. ఇది నాలుగున్నర లక్షలు) ఇంకా నగరంలోని అనేక ప్రాంతాలకు మెట్రో విస్తరించాల్సిన అవసరముందని భారీ ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి.
ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రెండో దశను 31 కిలోమీటర్ల మేర చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు ఐదు కిలోమీటర్లు… లింగంపల్లి నుంచి లక్డీకాపూల్ వరకు మరో 26 కిలోమీటర్లు మొత్తం 31 కిలోమీటర్లకు రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రాజెక్టుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్వయానా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అవసరమైన డాక్యుమెంట్లు, డీపీఆర్ ఇచ్చారు. కానీ రాజకీయ దురుద్దేశంతో ఇది సాధ్యం కాదంటూ కేంద్రం తెలంగాణపై వివక్షను ప్రదర్శించింది.
దేశంలోని అనేక నగరాల్లోని మెట్రోలు సరైన ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రో అదే తరహాలోనిది. కనీసం రోజుకు 50వేల మంది ప్రయాణికులు కూడా ఎక్కని మెట్రోలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆయా నగరాల్లో రెండో దశకు సైతం మంజూరీలు ఇచ్చి తన రాజకీయ స్వార్థాన్నిబయటపెట్టుకుంది.
జైపూర్ మెట్రో… ప్రయాణించే వారు కరువై! అక్కడి అధికారులు చిన్నపాటి వేడుకలకు బోగీలను అద్దెకు ఇస్తున్నారు. అంటే… మెట్రో లక్ష్యం నెరవేరలేదు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నగరానికి మరిన్ని నిధులిచ్చి మెట్రో విస్తరణకు సహకరిస్తుంది.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)… ఇక్కడి మెట్రోలో హైదరాబాద్ మెట్రో కంటే రోజువారీ ప్రయాణికుల సంఖ్య తక్కువ. అయినా కేంద్రంలోని మోదీ సర్కారు విస్తరణలో భాగంగా రెండో దశకు ఏకంగా రూ.7454.47 కోట్ల సాయం చేస్తుంది. మొత్తం బెంగళూరు మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయంలో కేంద్రం ఏకంగా 31 శాతం వాటాను చెల్లిస్తుంది.
పుణె మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా రెండున్నర వేలు. రూ.5095.50 కోట్ల అంచనా వ్యయంతో పన్నెండు కిలోమీటర్ల మేర చేపట్టే పుణె మెట్రో రెండో దశకు సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తుంది.
కానీ ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ మెట్రో రైలు… ప్రయాణికులు అత్యధికంగా ఆదరించే దేశంలోనే రెండో అతి పెద్దదైన హైదరాబాద్ మెట్రోకు సహకారం అందించేందుకు మోదీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కొన్ని నగరాల్లో అలంకారప్రాయంగా మారుతున్న మెట్రోలకు అండగా నిలుస్తూ… సాంకేతికంగా, ప్రయాణికుల పరంగా విజయవంతమైన హైదరాబాద్ మెట్రో రెండో దశ ‘సాధ్యం కాదు’ అంటూ దీర్ఘాలు తీస్తుంది. దీంతో మోదీ ప్రభుత్వం ప్రజావసరాలు కాకుండా రాజకీయ ప్రాతిపదికన మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకారం అందిస్తుందని మరోసారి రుజువైంది.
Metro1