Hyderabad Metro | సిటీ బ్యూరో, మే 4(నమస్తే తెలంగాణ) : మెట్రో చార్జీలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హయాంలో కూడా చార్జీలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, త్వరలోనే మెట్రో ప్రయాణికులపై భారం పడనున్నది. కాగా, 7.5 వడ్డీ కూడా సంస్థకు ఆర్థికంగా భారం అవుతున్నదని, కొవిడ్ లాక్ డౌన్ సంస్థను మరింత నష్టపరిచిందని దీంతోనే మొత్తం అప్పులు రూ .6500 కోట్లకు చేరిందని ఎల్ అండ్ టీ ప్రకటించింది. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు చార్జీల పెంపుతో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది.
67 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 18 మిలియన్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. ఏడున్నర సంవత్సరాలుగా 8 మిలియన్ల స్పేస్ మాత్రమే వినియోగంలోకి వచ్చింది. ఈ క్రమంలో కమర్షియల్ స్పేస్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేలా ఎల్ అండ్ టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించలేదు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో మెట్రో ఛార్జీలను 44% పెంచింది. అదే తరహాలో హైదరాబాదులో పెంచితే ఏటా రూ 150 కోట్ల భారం తగ్గుతుందని లెక్కలు కూడా వేసుకుంది. ఇదే గనుక జరిగితే నగరంలో మినిమం టికెట్ ధర రూ.14 నుంచి రూ 15 అయ్యే అవకాశం ఉంటుంది.