సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో పాటు స్తంభాలు విరిగిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ్బందిని వెంటనే మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించారు.
గచ్చిబౌలిలో అత్యధికంగా 2.8 సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, రాజేంద్రనగర్, శివరాంపల్లిలో 2.2, కిషన్‌బాగ్, షేక్‌పేటలో 2.0, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురలో 1.6, ఖైరతాబాద్, ఫిల్మ్‌నగర్‌లో 1.3, జుమ్మెరాత్‌బజార్, విజయ్‌నగర్‌కాలనీ, హిమాయత్‌నగర్, నాంపల్లి, బేగంబజార్, కాంచన్‌బాగ్ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. రాగల మరో 3రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.